హీరా గ్రూప్‌కు వ్యాపారమే లేదు

Hire Group has no business - Sakshi

మనీలాండరింగ్‌ కోసమే డిపాజిట్లు

నౌహీరా సహా ముగ్గురి అరెస్టు 

అధికారికంగా వెల్లడించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  

సాక్షి, హైదరాబాద్‌: వివిధ రకాల స్కీముల పేరుతో భారీగా డిపాజిట్లు వసూలు చేసి స్కామ్‌కు పాల్పడ్డ హీరా గ్రూప్‌నకు ఎలాంటి వ్యాపారం లేదని గుర్తించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తేల్చి చెప్పింది. కేవలం మనీలాండరింగ్‌ కోసమే డబ్బు వసూలు చేసినట్లు అనుమానిస్తున్నామని పేర్కొంది. దీనికి సంబంధించి తాము నమోదు చేసిన కేసులో గ్రూప్‌ సీఈవో నౌహీరా షేక్‌తోపాటు ఆమెకు ప్రధాన అనుచరులుగా భావిస్తున్న మోల్లీ థామస్, బిజూ థామస్‌లను అరెస్టు చేసినట్లు బుధవారం ప్రకటించింది. న్యాయస్థానం అనుమతితో తదుపరి విచారణ నిమిత్తం వారం రోజుల కస్టడీకి తీసుకున్నట్లు తెలిపింది. హీరా గ్రూప్‌ డిపాజిట్‌దారులకు సాలీనా 36 శాతం వడ్డీతోపాటు బంగారం వ్యాపారంలో పెట్టుబడులంటూ ఎర వేసింది. ఓ దశలో డబ్బు తిరిగి చెల్లించడంలో గ్రూప్‌ విఫలం కావడంతో అనేక మంది బాధితులుగా మారారు. ఇప్పటివరకు ఈడీ సేకరించిన సమాచారం ప్రకారం 1,72,114 మంది డిపాజిట్‌దారుల నుంచి రూ.3 వేల కోట్లు వసూలు చేసినట్లు స్పష్టమైంది.

ఈ డబ్బులో అత్యధిక శాతం తమ సొంత ఖాతాల్లోకి మళ్ళించిన నిందితులు, వాటితో వివిధ ప్రాంతాల్లో స్థిర, చరాస్తులు ఖరీదు చేశారు. హీరా గ్రూప్‌ బాధితులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలతో పాటు యూఏఈ, సౌదీ అరేబియా, మధ్య ఆసియా దేశాల్లోనూ ఉన్నట్లు ఈడీ పేర్కొంది. హీరా గ్రూప్‌ ముసుగులో నౌహీరా 24 సంస్థల్ని స్థాపించినట్లు, వీటి ఆధారంగా 182 బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు వెలుగులోకి వచ్చింది. వీటికితోడు యూఏఈ, సౌదీ అరేబియాల్లో మరో 10 ఖాతాలు ఉన్నట్లు తేలింది. హీరా గ్రూప్‌తోపాటు దాని ఖాతాదారుల వివరాలు నిర్వహించడానికి బిజు థామస్‌ తానే ఎండీగా శ్రవణ్‌ టెక్నాలజీస్‌ సొల్యూషన్స్‌ పేరుతో కేరళలో సంస్థను ఏర్పాటు చేసినట్లు ఈడీ తెలిపింది. మొల్లీ థామస్‌ ఆది నుంచీ నౌహీరా వెంట ఉండి మోసాలకు సహకరించినట్లు ఆరోపించింది. హీరా గ్రూప్‌ కంపెనీలు, బ్యాంక్‌ ఖాతాల లావాదేవీలతోపాటు అక్రమ ఆస్తుల విషయాన్నీ కస్టడీలో ఉన్న నిందితుల నుంచి ఈడీ సేకరించనుంది.

ఈడీ కస్టడీకి: నౌహీరా షేక్‌ చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలి సిందే. ఈ కేసులో ఆమెను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు బుధవారం కోర్టు ఉత్తర్వులతో కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను ఈడీ ఏడు రోజులపాటు విచారించనుంది. ఇదే కేసు లో చంచల్‌గూడ జైల్లోనే రిమాండ్‌ ఖైదీ లుగా ఉన్న బిజూ థామస్, మౌళి థామస్‌లను కూడా కస్టలోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top