గుట్కా కేరాఫ్‌ గుంటూరు!

Gutka Gang Arrest In Guntur - Sakshi

నగర శివారుల్లో తయారీ కేంద్రాలు

బీహార్, ఒరిస్సా, అస్సాంల నుంచి వస్తున్న కార్మికులు

నెలరోజుల పాటు అద్దెకు తీసుకున్న పాత గోడౌన్లలో ఉండి మరీ తయారీ

అత్యవసరమైతేనే బయటకు కార్మికులు

గుంటూరు రూరల్‌:  గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని అటు ప్రభుత్వం, ఇటు అధికారులు చేస్తున్న వాగ్దానాలు కేవలం మా టలకే పరిమితమయ్యాయి. గుంటూరు కేంద్రంగా విక్రయాలు పక్కన బెడితే ఏకంగా  తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. గుంటూరు నుంచి జిల్లాలోని పలు కేంద్రాలకే కాకుండా రాష్ట్ర నలుమూలలకు ఇక్కడ నుంచే సరుకు రవాణా అవుతుందంటే అతిశయోక్తి కాదు. ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు మిన్నకుండిపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరశివారుల్లో పాతగోడౌన్లలో సినీఫక్కీలో ఈ దందా సాగుతున్న తీరుపై పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తయారీ సాగేదిలా..
నగర శివారుల్లోని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, ఎన్‌హెచ్‌ 16 హైవే, ఏటుకూరు రోడ్డు, పర్చూరురోడ్డు, అంకిరెడ్డిపాలెం రోడ్డు, లింగాయపాలెం రోడ్డు, మిర్చియార్డు సమీపంలోని పాతబడిన గోడౌన్‌లను తయారీ దారులు నెల రోజులకు అద్దెకు తీసుకుంటారు. ముందుగా పథకం ప్రకారం బీహార్, ఒరిస్సా, అస్సాం రాష్ట్రాల నుంచి యువకులు, కార్మికులను మాట్లాడుకుని నెల రోజులకు సరిపడా ఆహార పదార్థాలను సైతం అదే గోడౌన్‌లో అందుబాటులో ఉంచుకుంటారు. సుమారు 5–6 మంది కార్మికులు మిషన్‌తో సహా ముడి సరుకును గోడౌన్‌లో తయారు చేస్తారు. కార్మికులు సరుకు, మిషన్‌ను గోడౌన్‌లో ఉంచి బయట తాళం వేసి యథావిధిగా నిర్వహణదారులు వెళ్లిపోతారు. నెల రోజులపాటు అత్యవసరమైతేనే గోడౌన్‌ రాత్రి వేళల్లో తలుపులు తీస్తారు.  తయారీ చేసిన సరుకును నెల రోజుల అద్దె పూర్తయిన వెంటనే రాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా బయటకు తీసి మరో చోటకు మార్చి దాస్తారు. అనంతరం దుకాణాలకు విక్రయాలు చేస్తారు.

పర్యవేక్షణ లోపం
గుట్టు చప్పుడు కాకుండా నగర శివారుల్లోని పాతబడిన గోడౌన్‌లలో గుట్కాల తయారీ చేస్తున్నా అధికారులు పర్యవేక్షణ కరువైందని ప్రజలు విమర్శిస్తున్నారు. పాతబడిన గోడౌన్‌లపై నిఘా కొనసాగిస్తే అక్రమంగా తయారీ చేస్తున్న పొగాకు ఉత్పత్తులను అరికట్టవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిం చి పాతబడిన గోడౌన్‌లలో తనిఖీలు చేసి నిషేదిత పొగాకు ఉత్పత్తుల తయారీదారులపై చర్యలు తీ సుకుని ప్రజల ఆరోగ్యాలను కాపాడాలనికోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం
నిషేధిత పొగాకు ఉత్పత్తులు తయారీ విక్రయ కేంద్రాలపై అర్బన్‌ ఎస్పీ ఆదేశాల ప్రకారం దాడులు చేస్తూనే ఉన్నాం. పలువురిపై కేసులు నమోదు చేశాం. అక్రమంగా తయారు చేసినా, విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గోడౌన్లలో తయారీపై మాకు సమాచారం లేదు. ఇటువంటి ఘటనలు ఉంటే ప్రజలు మాకు ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
నల్లపాడు ఎస్‌హెచ్‌వో బాలమురళీకృష్ణ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top