నెల్లూరు గురుకులంలో అమానుషం

Gurukul School Principal rude behavior with a boy At Nellore - Sakshi

     విద్యార్థులపై విచక్షణారహితంగా ప్రిన్స్‌పాల్‌ దాడులు

     తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు

నెల్లూరు రూరల్‌: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ప్రిన్సిపాల్‌ విచక్షణ మరచి విద్యార్థులపై వివిధ రూపాల్లో దాడులకు పాల్పడుతున్నాడు. విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు వైఖరి మార్చుకోవాలని సూచించినా పట్టించుకోలేదు. చివరకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రిన్సిపాల్‌ కటకటాల పాలైన ఘటన నెల్లూరులోని ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. సర్వేపల్లికి కేటాయించిన ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలలో వసతులు లేకపోవడంతో 2016లో నెల్లూరు పొదలకూరు రోడ్డులోని జెడ్పీ హైస్కూల్‌ భవనంలో ఏర్పాటు చేశారు. ఇందులో 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

విద్యార్థులను బట్టలు విప్పించి కొట్టడం, తలను గొడకేసి బాధడం, కాళ్లతో తన్నడం, కర్రలతో చేతులు, కాళ్లపై కొట్టడం, దుర్భాషలాడుతున్నారని వారు పోలీసులకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్‌లోకి మద్యం తీసుకొచ్చి తాగడం, విద్యార్థుల చేత సపర్యలు, ఇంటి పనులు చేయించుకోవడం, ఎదురు తిరిగిన వారిపై దాడి చేసి గాయపరిచేవారని ఆరోపించారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు ఏపీ యానాది సమాఖ్య సహకారంతో ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. వేదాయపాళెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సీఐ నరసింహారావు, సిబ్బంది మంగళవారం గురుకులంలో విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్‌ వెంకటరమణను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top