విద్యత్‌ఘాతానికి గురై బాలిక మృతి

Girl Died With Current Shock While Playing On Terrace In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి(పిఠాపురం) : వారిద్దరూ మిత్రులు. ప్రస్తుతం  ఏడో తరగతి చదువుతున్న వీరు ఎప్పుడూ కలిసే ఉంటారు. కలిసే ఆడుకుంటారు. ఎప్పటిలానే తమ మేడపై ఆడుకుంటుండగా విద్యుత్‌ షాక్‌ రూపంలో వచ్చిన మృత్యువు ఆ స్నేహాన్ని విడదీసింది. ఒకరు అనంత లోకాల్లో కలసి పోగా మరొకరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. హృదయ విదారకమైన ఈ సంఘటన పిఠాపురం పట్టణంలోని లయన్స్‌క్లబ్‌ ఏరియాలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. పిఠాపురం లయన్స్‌క్లబ్‌ ఏరియాలో నివాసముంటున్న చింతపల్లి రామచంద్రారెడ్డి కుమార్తె చింతపల్లి సమీర(11), వారి ఇంటికి దగ్గరలో ఉన్న ఇందనపు సుబ్బలక్ష్మి కుమార్తె ఐశ్వర్య (12) ఇద్దరు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. ఇద్దరు స్థానిక ప్రైవేటు స్కూల్లో ఏడో తరగతి చదువుతుండగా ఐశ్వర్య ఈ ఏడాది ప్రైవేటు స్కూల్‌ నుంచి స్థానిక ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ పాఠశాలకు మారింది. 

స్నేహితురాలికి జ్వరం వచ్చిందని.. 
స్కూలుకు వెళ్లేటప్పుడు వచ్చిన తరువాత ఇద్దరు కలుసుకుని మాట్లాడుకోవడం, ఖాళీ సమయాల్లో కలిసి ఆడుకోవడం చేస్తుంటారు. బుధవారం స్కూల్‌కు బయల్దేరిన ఐశ్వర్య తన స్నేహితురాలు బడికి వెళ్లడం లేదని జ్వరం వచ్చిందని తెలిసి తాను బడికి వెళ్లడం మానేసింది. తన ఫ్రెండ్‌ సమీర ఇంటికి వెళ్లిన ఐశ్వర్య సమీరకు తోడుగా ఉంది. జ్వరం కాస్త తగ్గడంతో ఇద్దరు మధ్యాహ్నం సమీర ఇంటి మేడపైన బంతాట ఆడుకుంటున్నారు. ఇంతలో బంతి మేడ పిట్టగోడకు బిగించి ఉన్న లైట్‌ వద్దకు వెళ్లి పోవడంతో దానిని తీసుకునే ప్రయత్నం చేసిన ఐశ్వర్య ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌కు గురై లైట్‌కు అతుక్కుపోయింది. అక్కడే ఉన్న సమీర ఆమెను రక్షించే ప్రయత్నం చేసి ఆమెను లాగే ప్రయత్నంలో ఆమె కూడా కరెంట్‌ షాక్‌కు గురైంది.

ఇంతలో వారి అరుపులు విన్న సమీర తల్లి నాగశివజ్యోతి పరుగున మేడపైకి వచ్చి ఇద్దరినీ రక్షించే ప్రయత్నంలో తాను కూడా కరెంట్‌ షాక్‌కు గురవుతానన్న భయంతో వెంటనే కిందకు వెళ్లి మెయిన్‌ ఆఫ్‌ చేసి వచ్చి ఇద్దరినీ విడిపించి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఐశ్వర్య మృతి చెందింది. సమీరను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. కంటికి రెప్పలా పెంచుకున్న కన్న కూతురు ఇక లేదని తెలిసి గుండెలవిసేలా రోదిస్తున్న మృతురాలి తల్లి సుబ్బలక్ష్మిని ఆపడం ఎవరితరం కావడం లేదు. పిఠాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top