మరణంలోనూ వీడని స్నేహం

Friends Died in West Godavari Road Accident - Sakshi

సామర్లకోటలో రోడ్డు ప్రమాదం

ఏలూరుకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి

ఏలూరు టౌన్‌ :  మరణం వారిని వెంటాడింది.. చిన్ననాటి స్నేహితులు ఇద్దరూ మరణంలోనూ వీడిపోలేదు.. వేగంగా వస్తోన్న లారీ మృత్యువులా వచ్చి ఇద్దరు విద్యార్థుల నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు విద్యార్థులు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట కెనాల్‌రోడ్డులో లారీ ఢీకొనటంతో మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు వన్‌టౌన్‌ తూర్పువీధికి చెందిన ఎస్‌కే రబ్బానీ ఏలూరు మండలం సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఎస్‌కే హనీఫ్‌ ఏలూరు శివారు ప్రాంతంలోని ఒక ఇంజినీరింగ్‌ కాలేజీలో ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. రబ్బానీ, హనీఫ్‌ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరూ హనీఫ్‌కు చెందిన ఆర్‌వన్‌5 బైక్‌పై గురువారం ఉదయం  ఏలూరు నుంచి విశాఖపట్నం బయలుదేరారు.  తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట కెనాల్‌ రోడ్డు ప్రాంతానికి చేరుకునే సరికి వేగంగా వస్తున్న లారీ వీరి మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ అదుపుతప్పి కాలువలో తిరగబడగా, ఇరువురు విద్యార్థులు మృతిచెందారు. ఏలూరుకు చెందిన ఈ ఇద్దరు విద్యార్థులు మృతిచెందారనే వార్త వారి బంధువులు, స్నేహితులను దుఃఖసాగరంలోకి నెట్టేసింది. 

ఏలూరు తూర్పువీధికి చెందిన ఎస్‌కే బాబు ఆదివారపుపేటలో చికెన్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. ఎస్‌కే బాబుకు ముగ్గురు కుమారులు కాగా మూడో కుమారుడైన రబ్బానీని డిగ్రీ చదివిస్తున్నారు. ఏలూరు జెడ్పీ కార్యాలయం సమీపంలోని న్యూ మదీనా బిర్యానీ దుకాణాన్ని నిర్వహిస్తున్న ఎస్‌కే హసేన్‌ వలీకి ఇద్దరు కుమార్తెలు ఉండగా మృతిచెందిన హనీఫ్‌ ఒక్కడే కుమారుడు. హనీఫ్‌ తండ్రి బిర్యానీ దుకాణంలో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రబ్బానీ, హనీఫ్‌ మృతి తీరనిలోటుగా మారింది. చేతికి అందివ
చ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకానికి చేరుకోవటం  వారిని కలచివేస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top