మిన్నకుంటే మళ్లీ రెచ్చిపోయాడు

Friend Harassments On Woman Complaint To She Team - Sakshi

స్నేహితురాలిపై  ప్రేమోన్మాది అత్యాచారం

బెదిరించడంతో ఎవరికీ చెప్పని బాధితురాలు

వేధింపులకు దిగడంతో షీటీమ్స్‌కు ఫిర్యాదు

సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): బాధిత యువతులు/మహిళల మౌనమే నేరగాళ్లకు వరంగా మారుతోంది. వీరి భయాన్ని ఆసరాగా చేసుకున్న కామాంధులు పదేపదే రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఉదంతమే రాజేంద్రనగర్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎట్టకేలకు బాధితురాలు ధైర్యం చేసి షీ–టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో నిందితుడు కటకటాల్లోకి చేరాడు. గత నెలలో సైబరాబాద్‌ షీ–టీమ్స్‌కు 109 ఫిర్యాదులు రాగా... 29 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 19 మంది నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. రాజేంద్రనగర్‌కు చెందిన ఓ మహిళ బీటెక్‌ చదువుతున్న రోజుల్లో డిప్లమో చదివే విద్యార్థితో పరిచయం ఏర్పడింది.

రెండు నెలల తర్వాత అతను ఆమె వద్ద ప్రేమ ప్రతిపాదన  తేగా ఆమె తిరస్కరించింది. దీంతో ఫోన్‌ కాల్స్‌ ద్వారా వేధించడంతో పాటు అసభ్యపదజాలంతో దూషించడం మొదలెట్టాడు. ఓ దశలో ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఇంత జరిగినా సదరు యువతి ఎవరికీ చెప్పుకోకుండా మౌనంగా ఉండిపోయింది. దీనిని ఆసరాగా చేసుకున్న అతను గత జనవరి 24న చేవెళ్ల బస్టాప్‌ వద్ద ఉన్న ఆమె సెల్‌ఫోన్‌ లాక్కోవడంతో పాటు బలవంతంగా తన వాహనంపై ఎక్కించుకుని గోపన్‌పల్లి పరిసరాల్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి దాడి చేయడంతో స్ఫృహ కోల్పోయింది. అదే అవకాశంగా భావించిన అతను ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఈ విషయం బయటకు చెబితే ఆమెతో పాటు కుటుంబాన్నీ హతమారుస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు తన కుటుంబం పరువు పోతుందనే ఉద్దేశంతో తనలో తానే కుమిలిపోయింది. ఆమె మౌనాన్ని మరోసారి తనకు అనువుగా మార్చుకోవాలని భావించిన అతను మళ్లీ ఆమెకు ఫోన్లు చేయడం, సందేశాలు పంపడం చేస్తూ తనతో రావాల్సిందిగా బెదిరిస్తున్నాడు. ఈ చర్యలతో విసిగిపోయిన బాధితురాలు సైబరాబాద్‌ షీ–టీమ్స్‌ను సంప్రదించడంతో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే ప్రేమ పేరుతో వేధింపులకు దిగిన, వాట్సాప్‌ కాల్స్‌ ద్వారా వేధించిన, ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరకావడంతో పాటు రూ.1.05 లక్షలు తీసుకుని మోసం చేసిన నిందితులపై కేసులు నమోదు చేశారు. గత నెలలో మొత్తం 109 ఫిర్యాదులు రాగా, 29 క్రిమినల్‌ కేసులు, మరో 20 పెట్టీ కేసులు నమోదు చేశారు. మిగిలిన వాటిలో నిందితులకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. బహిరంగం ప్రదేశాల్లో 9 వర్క్‌షాపులు నిర్వహించి 4108 మందికి అవగాహన కల్పించారు. బాధితులు 9490617444కు వాట్సాప్‌ చేసి, 100కు కాల్‌ చేసి తమకు సంప్రదించాలని సైబరాబాద్‌ షీ–టీమ్స్‌ అధికారులు కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top