టెన్త్‌ విద్యార్థినిపై ఇద్దరు విద్యార్థుల లైంగిక దాడి

Fellow Students Molested Tenth Girl In Proddatur - Sakshi

హాస్టల్‌ భవనంపైకి లాక్కెళ్లి అఘాయిత్యం 

స్కూల్‌ యాజమాన్యానికి మొరపెట్టుకున్న బాలిక

బయటకు చెబితే పరీక్ష ఫెయిల్‌ చేయిస్తానంటూ కరస్పాండెంట్‌ బెదిరింపు

అవమానభారంతో హాస్టల్‌ భవనంపై నుంచి దూకిన బాలిక

తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలు

ప్రొద్దుటూరు క్రైం: పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థి.. మరో విద్యార్థితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. జరిగిన ఘోరంపై స్కూల్‌ యాజమాన్యం వద్ద బాలిక మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. బాలికకు ధైర్యం చెప్పాల్సిన పాఠశాల కరస్పాండెంట్‌.. మరింత బెదిరించడంతో బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రొద్దుటూరులో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. ఎర్రగుంట్ల మండలానికి చెందిన బాలిక ప్రొద్దుటూరు నేతాజీనగర్‌లోని ప్రైవేట్‌ స్కూల్‌ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతోంది.

ఈ నెల 24వ తేదీన బాలిక హాస్టల్‌ గదిలో ఉండగా అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలుడు, ఏడాది కిందట ఆ పాఠశాలలో పదో తరగతి చదివిన మరో బాలుడు కలిసి బాలికను హాస్టల్‌ పైఅంతస్తులోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. భయంతో వణికిపోయిన బాలిక జరిగిన ఘటన గురించి స్కూల్‌ కరస్పాండెంట్‌కు చెప్పింది. బాలికకు ధైర్యం చెప్పి ఓదార్చాల్సిన ఆయన.. ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తానని.. టెన్త్‌ క్లాస్‌ ఫెయిల్‌ చేయిస్తానంటూ బాలికనే బెదిరించాడు. దీంతో తీవ్ర అవమానభారంతో ఆ బాలిక 25వ తేదీన పాఠశాల మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

కాలు జారిపడినట్లు కుటుంబ సభ్యులకు ఫోన్‌
పాఠశాల మైదానంలో అపస్మారక స్థితిలో పడిఉన్న బాలికను స్కూల్‌ యాజమాన్యం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించింది. ‘మీ పాప స్కూల్‌ భవనంపై నుంచి కాలు జారి కింద పడింద’ని స్కూల్‌ యాజమాన్యం బాలిక కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేయడంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు. వారు వచ్చేలోపే.. పరిస్థితి విషమించిందని, కర్నూలు ఆస్పత్రికి తరలించాలని బాలికను అంబులెన్స్‌లో ఎక్కించారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక 27 సాయంత్రం స్పృహలోకొచ్చింది. బాలికకు నడుము, కాళ్లు పూర్తిగా విరిగిపోయాయని వైద్యులు చెప్పారు. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తన చిన్నమ్మకు వివరించింది. ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లేందుకు బాలిక కుటుంబ సభ్యులు ప్రయత్నించగా అక్కడ కాపలాగా ఉన్న స్కూల్‌ యాజమాన్యం మనుషులు వారిని అడ్డుకుని బెదిరించారు. ఈ క్రమంలో తిరుపతి ఆస్పత్రికి వెళ్తున్నామని చెప్పి బాలికను గురువారం సాయంత్రం ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి.. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ సీఐ రామలింగమయ్య చెప్పారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top