ఈ నెల 21 వరకు విచారించనున్న ఈడీ

Enforcement Directorate Probe Heera Group Chairman Nowhera Shaik - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ యజమాని నౌహీరా షేక్‌ను వారం రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నౌహీరాను బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 21 వరకు ఆమెను ప్రశ్నించనున్నారు. ఈ విషయం గురించి ఓ అధికారి మాట్లాడుతూ.. నౌహీరాతో పాటు.. ఆమె సహాయకురాలు మౌలి థామస్‌, మరో సహాయకుడు విజీని కూడా అరెస్ట్‌ చేశామన్నారు. పీఎంఎల్‌ యాక్ట్‌ కింద నౌహీరాను విచారిస్తున్నామని తెలిపారు. హీరా గ్రూపు దేశ వ్యాప్తంగా 1.72 లక్షల మంది నుంచి రూ.3 వేల కోట్లు వసూలు చేసినట్లు గుర్తించామన్నారు.

హీరా గ్రూపు విదేశీయుల నుంచి సైతం డిపాజిట్‌లు వసూలు చేసి.. ఆ సొమ్మును తమ సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లు తెలిసిందన్నారు. హీరా గ్రూప్‌ దేశ విదేశాల్లో 24 వ్యాపార సంస్థలు నెలకొల్పి.. 18 బ్యాంక్‌ ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తోందన్నారు. సౌదీ, యూఏఈ దేశాలతో పాటు హీరా గ్రూపుకు మరో 10 బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
పీఎంఎల్‌ యాక్ట్‌ కింద నౌహీరాను విచారిస్తున్న ఈడీ

ఈడీ అధికారులు నౌహీరా షేక్‌ను తీసుకెళ్లే సమయంలో జైలు నుంచి బయటకు రాగానే ఆమె కింద పడిపోయింది. వెంటనే అధికారులు వచ్చి ఆమెను పైకి లేపారు. నౌహీరా షేక్‌ ప్రస్తుతం రంజాన్‌ ఉపవాస దీక్షలో ఉన్నట్లు జైలువర్గాలు తెలిపాయి. ఆమె బీపీ, షుగర్‌ లెవల్స్‌  పడిపోవడంతో ఇలా జరిగిందన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top