స్పెషల్‌ డ్రైవ్‌ తగ్గింది.. డ్రంక్‌ పెరిగింది

Drunk and Drive Tests On Highway - Sakshi

మద్యం తాగి భారీ వాహనాలు నడిపే వారిపై నియంత్రణ నిల్‌

ద్విచక్రవాహనదారులపైనే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు

భారీ వాహన డ్రైవర్‌లపై దృష్టి సారించకపోవడంతో పెరుగుతున్న ప్రమాదాలు  

జమ్మలమడుగు: మద్యం సేవించి వాహనం నడపడమే నేరం.. ఇక మద్యం మత్తులో వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదం చేసి అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటే అది మరింత పెద్ద నేరమవుతుంది. అలాంటప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నియంత్రణ పేరుతో ద్విచక్రవాహన దారులను ముప్పు తిప్పలు పెట్టే పోలీసులు లారీలు తదితర భారీ వాహనాల డ్రైవర్లు మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్నా పట్టీపట్టనట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ద్విచక్రవాహనదారులకు ఆర్‌సీ, లైసెన్సు లేవంటూ వందలాది రూపాయల జరిమానా విధించే పోలీసులు లారీ డ్రైవర్‌లు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నా వారిపై చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రమాదాల్లో మరణించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. గత గురువారం రాత్రి  జమ్మలమడుగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ శ్రీనివాసులు మద్యం తాగి వాహనాన్ని నడపడంతోనే  వేగంగా వచ్చి వెనుకవైపు నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ముగ్గురు రాజస్థాన్‌ యువకుల మృతికి కారకుడయ్యాడని తెలుస్తోంది. ద్విచక్రవాహనదారులు సరైన మార్గంలో వెళ్లడమే గాక, వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్‌పెట్టుకుని వాహనం నడుపుతున్నా లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడాల్సి వచ్చింది.

లారీలు మద్యం దుకాణాల వద్ద నిలబడి..
లారీ డ్రైవర్‌లు మద్యం దుకాణాల వద్ద వాహనాలను నిలిపి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని తెలిసినా వారి జోలికి పోలీసులు వెళ్లలేని పరిస్థితి ఉంది. అయితే కేసులు అవసరమైనప్పుడు మద్యం దుకాణం వద్దే బ్రీతింగ్‌ ఎనలైజర్‌ మిషన్‌ పట్టుకుని నిలబడే పోలీసులు ద్విచక్రవాహనదారులకు చమటలు పట్టిస్తున్నారు. అదే భారీ వాహన డ్రైవర్‌ మద్యం మత్తులో ఉంటే ఎంత భారీ నష్టం జరుగుతుందో తెలిసి కూడా పోలీసులు వారి గురించి పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఈ ఏడాదిలో ఘోర ప్రమాదం..
జమ్మలమడుగు సమీపంలో గత గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఈ ఏడాదిలో ఘోర రోడ్డు ప్రమాదంగా చెప్పుకోవచ్చు. 2017 జనవరిలో పట్టణంలో మద్యం తాగి వాహనం నడుపుతూ డివైడర్‌లకు ఢీకొని ముగ్గురు యువకులు మరణించారు. ఈ సంఘటన తర్వాత ప్రమాదంలో  ఒకే సారి ముగ్గురు వ్యక్తులు మరణించడం ఈ ఏడాది ఇదే తొలి సంఘటన. దానితో పాటు గతేడాది మే నెలలో ట్యాంకర్‌ డ్రైవర్‌ ఆర్టీసీ బస్సును ఓవర్‌ టెక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొని ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు బలిగొన్నాడు. నియోజకవర్గంలో ఎక్కువగా లారీ  ఇతర వాహనాల  డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు, మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరిగినట్లు పోలీసు రికార్డులు తెలుపుతున్నాయి.

లారీ డ్రైవర్‌లకు కూడా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేపట్టాలి..
పట్టణంలో నుంచి ఇటివల కాలంలో భారీగా లారీలు వెళుతున్నాయి. డ్రైవర్‌లు మద్యంషాపుల వద్ద వాహనాలను నిలిపి మద్యం సేవించి వెళుతున్నారు. దీని వల్ల రోడ్లపై వెళ్లే వారు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. – భూతమాపురం సుబ్బారావు, న్యాయవాది, జమ్మలమడుగు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top