ప్రేమ ముసుగులో.. ఈనేరం

Cyber Crimes With Love Named in Hyderabad - Sakshi

నానాటికీ పెరుగుతున్న సైబర్‌ మృగాళ్లు

ఈ నిందితుల్లో విద్యాధికులే ఎక్కువ

కనీస జాగ్రత్తలు అవసరం: సైబర్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: ప్రేమ పేరుతో మోసం చేయడం, వేధింపులకు పాల్పడటం... మోసపోయి హత్యలు, ఆత్మహత్యలు వంటి దారుణాలకు ఒడిగట్టడం... చాలాకాలంగా జరుగుతున్నదే. వీటికి తోడు ఇటీవలి కాలంలో ప్రేమ ముసుగులో ఈ–నేరాలు పెరిగిపోయాయి. ఈ–పోకిరీల కారణంగా యువతులు, మహిళలు మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇలాంటి నేరాలకు సోషల్‌ నెట్‌వర్కింగ్‌ మీడియాలైన ఫేస్‌బుక్, ఆర్కూట్‌ వంటివి వేదికలవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ ట్రెండ్‌ పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్లకు వచ్చే ఫిర్యాదుల్లో 40 శాతం ఈ–వేధింపులకు సంబంధించినవే కావడం గమనార్హం. పట్టుబడుతున్న నిందితుల్లో విద్యాధికులే ఎక్కువగా ఉంటున్నారు. ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్లే వీరికి ‘ఆయుధాలు’గా ఉపకరిస్తున్నాయి.  

‘బీటెక్‌ విద్యార్థి’ వేధింపులు...
మాజీ స్నేహితురాలిపై ఈ–మెయిల్స్, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌ ద్వారా అభ్యంతరకర ప్రచారానికి దిగిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గతంలో అరెస్టయ్యాడు. బెంగళూరుకు చెందిన ఇతను గతంలో హైదరాబాద్‌లోని ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో పని చేశాడు. అప్పట్లో తన సహోద్యోగిని అయిన యువతిపై ఈ–వేధింపులకు పాల్పడ్డాడు.

బీటెక్‌ విద్యార్థినికి‘మరుగుజ్జు వల’...
బోయిన్‌పల్లి ఫిరోజ్‌గూడకు చెందిన ఓ మరుగుజ్జు యువకుడు ఫేజ్‌బుక్‌లో అందమైన యువకుడి ఫొటో పెట్టాడు. గుంటూరుకు చెందిన ఓ యువతి ‘ఫ్రెండ్‌’గా పరిచయం కావడంతో చాటింగ్‌ ప్రారంభించాడు. ప్రేమ పేరుతో వలవేసి, అనేక కారణాలు చెప్పి ఆమె నుంచి రూ.3 లక్షల నగదు, 50 తులాల బంగారం స్వాహా చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు.

‘స్మార్ట్‌’తోనే చేటు: ఒకప్పుడు ఫోన్‌ అనేది విలాసవస్తువు. నేడు సెల్‌ నిత్యావసరంగా మారిపోయింది. నాటి ఫోన్లు ఇంటి మధ్యలో, పెద్దల పర్యవేక్షణలో ఉండేవి. సెల్‌ఫోన్ల రాకతో  ‘స్వేచ్ఛ’ పెరిగింది. స్మార్ట్‌ఫోన్ల రాకతో ఈ ధోరణి మరింత విచ్చలవిడిగా మారింది. ఆకర్షణను ప్రేమగా భావిస్తున్న యువతులు అపరిచితులతోనూ హద్దులు దాటుతున్నారు. కొన్ని సందర్భాల్లో ‘వ్యక్తిగత అంశాలను’ రికార్డు చేయడానికి అంగీకరిస్తున్నారు. ఓ దశలో అవే వారి పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఏటా నమోదవుతున్న సైబర్‌ నేరాల్లో ఈ తరహాకు చెందినవి 30 శాతం వరకు ఉంటున్నాయి. తల్లిదండ్రుల పర్యవేక్షణ, పిల్లల చర్యలపై వారి నిఘా ఉన్న కుటుంబాల్లో బాధితుల సంఖ్య తక్కువగా ఉంటోంది. తల్లిదండ్రులు తమ వారిపై కన్నేసి ఉంచితే ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఉండదు.– సైబర్‌ క్రైమ్‌ పోలీసులు  

డాక్టర్‌ ‘మిస్‌’కాల్‌...
నెల్లూరుకు చెందిన ఓ డాక్టర్‌ తన సెల్‌ఫోన్‌ నుంచి అపరిచిత నెంబర్లకు మిస్‌కాల్స్‌ ఇవ్వడం... తద్వారా వారితో పరిచయం పెంచుకోవడం అలవాటు. ఈ రకంగా పరిచయమైన నగరానికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థినితో పెళ్లి ప్రతిపాదన చేశాడు. నిరాకరించడం, ఆమెకు వేరే పెళ్లి నిశ్చయం కావడంతో కక్షకట్టాడు. ఆమె పేరుతోనే ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ తెరిచి స్నేహితులకు అసభ్యకర సందేశాలు పంపి అరెస్టయ్యాడు.

‘ప్రొఫైల్‌’తో ఎర...డబ్బుతో జల్సా...
మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లను వేదికగా చేసుకుని విద్యాధికుడినంటూ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసి ప్రచారం చేసుకున్న ఓ వ్యక్తి మోసాలకు దిగాడు. విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరైన ఇతను దాదాపు 52 మంది యువతులను ప్రేమ పేరుతో వలవేసిన ఇతను వీరిలో 22 మంది నుంచి రూ.12 లక్షలకు పైగా స్వాహా చేసి జల్సాలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతడి ఆటకట్టించారు.  

‘సాఫ్ట్‌’ ఇంజినీర్‌..హార్డ్‌ వేధింపులు..
కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి బెంగళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. గతంలో ప్రాజెక్ట్‌వర్క్‌ నేపథ్యంలో పరిచయమైన యువతితో ఒన్‌సైడ్‌ లవ్‌గా నడిపాడు. పెళ్లికి ఆమె తిరస్కరించడంతో కక్షకట్టిన అతను ఓ ల్యాప్‌టాప్, డేటాకార్డ్‌ కొనుగోలు చేసి వాటి సాయంతో ఆమె మెయిల్‌ ఐడీని హ్యాక్‌ చేసి ఆమె బంధువులు, స్నేహితులకు బాధితురాలి పేరుతో  అసభ్య చిత్రాలు, సందేశాలు పంపి అరెస్టు అయ్యాడు.

వేధింపులు.. బెదిరింపులు
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌లోనూ సైబర్‌ క్రైమ్‌ విభాగానికి అందుతున్న ఫిర్యాదుల్లో సగానికిపైగా ప్రేమ ముసుగులో జరుగుతున్న నేరాలేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆన్‌లైన్‌ వేధింపులకు పాల్పడుతున్న వారిలో పరిచయస్తులే ఎక్కువగా ఉండటం గమనార్హం. గతేడాది సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లో నమోదైన 1200 కేసుల్లో దాదాపు 600 కేసులు ప్రేమ ముసుగులో జరిగిన ‘ఈ–నేరం’లుగా పోలీసులు తెలిపారు. ప్రేమించాలని కొందరు, పెళ్లి చేసుకోవాలని మరికొందరు ఆన్‌లైన్‌ బెదిరింపులకు దిగితే, మరికొందరు తమ పరిచయస్తురాలికి మరొకరితో వివాహం జరుగుతుందని తెలిసి బెదిరింపులకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఆయా కేసుల్లో ఎక్కువ మంది విద్యాధికులే ఉంటున్నారని క్రైమ్స్‌ డీసీపీ జానకి షర్మిల తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top