కౌన్‌ బనేగా కరోడ్‌పతి లాటరీ తగిలిందని.. | Cyber Crimes in Hyderabad | Sakshi
Sakshi News home page

సైబర్‌ స్వాహా!

Feb 9 2019 11:01 AM | Updated on Feb 9 2019 11:01 AM

Cyber Crimes in Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ఉత్తరాదికి చెందిన సైబర్‌ నేరగాళ్లు ‘వజ్రాలు’ పేరు చెప్పి నగరానికి చెందిన ఇద్దరికి టోకరా వేశారు. వజ్రాలు పార్శిల్‌ చేస్తున్నామని ఒకరికి, కౌన్‌ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) లాటరీ తగిలిందని మరొకరికి ఎర వేశారు. వీరి నుంచి ఏకంగా రూ.25.54 లక్షలు స్వాహా చేశారు. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మెహిదీపట్నం వాసి రోజీ వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. గత ఏడాది నవంబర్‌లో ఆమెకు ఫేస్‌బుక్‌ ద్వారా మార్క్‌ స్కాట్‌ అని చెప్పుకున్న వ్యక్తి నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. దీన్ని ఆమె యాక్సెప్ట్‌ చేయడంతో ఇద్దరూ ఫేస్‌బుక్‌ఫ్రెండ్స్‌గా మారారు.

కొన్నాళ్లు చాటింగ్‌ చేసిన ఇరువురూ ఒకరి వివరాలు మరొకరు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాను జర్మనీ దేశస్తుడినంటూ స్కాట్‌ ఆమెను నమ్మించాడు. కొన్నాళ్లకు ఫోన్‌ నెంబర్లు మార్చుకున్న ఇరువురూ మాట్లాడుకున్నారు కూడా. ఫోన్‌ నెంబర్‌ చేతికి చిక్కిన వెంటనే స్కాట్‌ తన ఫేస్‌బక్‌ ఖాతాను తొలగించాడు. అప్పటి నుంచి ఇరువురూ వాట్సప్‌ ద్వారా చాటింగ్, ఫోన్లు కొనసాగించారు. ఆమె తనను పూర్తిగా నమ్మిందని భావించిన తర్వాత స్కాట్‌ గత ఏడాది డిసెంబర్‌లో అసలు అంకానికి తెరలేపాడు. బహుమతిగా కొన్ని విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, హ్యాండ్‌ బ్యాగ్, ఐఫోన్, 35 వేల పౌండ్లు పార్శిల్‌ చేసి పంపుతున్నానంటూ సందేశం ఇచ్చాడు. డిసెంబర్‌ 14న బాధితురాలికి ఓ మహిళ నుంచి ఫోన్‌ వచ్చింది. తాను కస్టమ్స్‌ అధికారినంటూ పరిచయం చేసుకున్న ఆమె మీ పేరుతో పార్శిల్‌ వచ్చిందని, దాన్ని క్లియర్‌ చేయాలంటే రూ.38 వేలు చెల్లించాలని చెప్పింది. ఆపై వివిధ పేర్లు చెబుతూ బాధితురాలి నుంచి మొత్తం రూ.14.71 లక్షలు కాజేసింది. మోసపోయానని గుర్తించిన ఆమె సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించింది.

బండ్లగూడ వాసికి ‘కేబీసీ’ పేరుతో..  
మరోపక్క చంద్రాయణగుట్ట పరిధిలోని బండ్లగూడకు చెందిన సాహిమ్‌ సుల్తానాకు ఐదు నెలల క్రితం మమతాదేవి అనే మహిళ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘కేబీసీ’ లాటరీలో ప్రైజ్‌ మనీ రూ.8 కోట్లు గెలుచుకున్నారని, ఆ డబ్బు మీకు చెందాంటే కొంత ప్రాసెసింగ్‌ ఫీజు చేయాలని ఎర వేసింది. ఇతర వివరాలు ముంబై ఆఫీస్‌ వాళ్లు చెప్తారంటూ చెప్పింది. కొన్నాళ్లకు ముంబైలోని కేబీసీ కార్యాలయం నుంచి ఠాకూర్‌ ప్రతాబ్‌సింగ్‌ను మాట్లాడుతున్నానంటూ మరో వ్యక్తి కాల్‌ చేశాడు. డబ్బు అందుకోవడానికి ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్టీ, ఆర్‌బీఐ ఫీజు తదితరాలు చెల్లించాలంటూ దఫదఫాలుగా రూ.14.83 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. అనంతరం ఎలాంటి సమాచారం గాని, ఫోన్‌ నంబర్లు కానీ పనిచేయలేదు. దీంతో మోసపోయాని గుర్తించిన ఆమె కూడా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement