ఐఫోన్‌ తక్కువ ధరకు అంటూ టోకరా

Cyber Crime Case Files in Uppal Hyderabad - Sakshi

ఉప్పల్‌ వాసి నుంచి రూ.1,43,000 వసూలు

నిందితుడు ముంబైవాసి నీలేశ్‌కుమార్‌ను

పట్టుకున్న రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: యూకే నుంచి ఐఫోన్‌లు అతి తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ నమ్మించి ఉప్పల్‌ వాసి నుంచి రూ.1,43,000లు వసూలుయచేసిన ముంబైకి చెందిన సైబర్‌ నేరగాడిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం ముంబై నుంచి ట్రాన్సిట్‌ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ హరనాథ్‌ తెలిపిన మేరకు.. ఫేస్‌బుక్‌లో వికాస్‌ పేరుతో సెకండ్‌ హ్యండ్‌ మొబైల్స్, ల్యాప్‌టాప్‌ల వ్యాపారం చేస్తానంటూ ఉప్పల్‌కు చెందిన బండి నరేశ్‌తో నిందితుడు నీలేశ్‌ కుమార్‌ పరిచయం చేసుకున్నాడు. రూ.ఐదు వేలు డిపాజిట్‌ చేస్తే యూకే నుంచి ఐఫోన్‌ సమకూరుస్తానంటూ నమ్మించాడు. అలా నిందితుడిచ్చిన బ్యాంక్‌ ఖాతాల్లో రూ.ఐదు వేలు జమ చేశాడు.

ఆ వెంటనే మరో 24 గంటల్లో ఐఫోన్‌ డెలివరీ అవుతుందంటూ బాధితుడి సెల్‌నంబర్‌కు ట్రాకింగ్‌ ఐడీని కూడా వాట్సాప్‌ పంపాడు. అయితే అదే వాట్సాప్‌ ద్వారా పంపిన ఈ మెయిల్‌ ఐడీ నుంచే 18 ఐఫోన్ల పార్శిల్‌ పంపిస్తామంటూ, డెలివరీ చార్జీల కోసం రూ.12,500లు చెల్లించాలని మెసేజ్‌ వచ్చింది. ఆ వెంట పార్శిల్‌ బ్రోకర్‌గా ఫోన్‌కాల్‌ చేసిన వ్యక్తి ఇన్సూరెన్స్‌ కోసం రూ.22,500లు చెల్లించాలని కోరాడు. ఆ తర్వాత కస్టమ్‌ చార్జీలు, జీఎస్‌టీ, ఎయిర్‌పోర్టు క్లియకెన్స్‌లతో మొత్తం రూ.1,43,000లు వసూలు చేశాడు. అనంతరం మరో రూ.20వేలు చెల్లించాలంటూ ఫోన్‌కాల్‌ రావడంతో అనుమానం వచ్చిన బాధితుడు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు ఫోన్‌కాల్స్, బ్యాంక్‌ ఖాతాల వివరాలతో ముంబై వాసి నిందితుడు నీలేశ్‌ కుమార్‌ గుర్తించి ముంబైలో పట్టుకున్నారు. ట్రాన్సిట్‌ వారంట్‌పై గురువారం నగరానికి తీసుకొచ్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top