కన్నా.. కనిపించరా..! | Child Missing Case In Darsi Prakasam | Sakshi
Sakshi News home page

ఆరూష్‌ ఎక్కడున్నావ్‌?

Jul 26 2019 8:09 AM | Updated on Jul 26 2019 8:16 PM

Child Missing Case In Darsi Prakasam - Sakshi

రెండేళ్ల బాలుడు తోటి పిల్లలతో ఆరుబయట ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. అప్పటి వరకు కళ్ల ముందే ఉన్నవాడు కనిపించకపోవడంతో తల్లి ఆందోళన చెందింది. బిడ్డ జాడ కోసం చుట్టు పక్కలంతా వెదికింది. ఎంతకీ ఆచూకీ తెలియక కన్నీరు మున్నీరవుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదంతా నెల రోజుల కిందటి మాట. అప్పటి నుంచీ కంటి మీద కునుకు లేదు. కుమారుడి కోసం వెదకని చోటు లేదు. ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి చేరతాడని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆ బాలుడి తల్లిదండ్రులు. మూడు రోజుల కిందట కిడ్నాపైన తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన బాలుడు జసిత్‌ క్షేమంగా ఇంటికి చేరడంతో తమ బిడ్డ కూడా తిరిగొస్తాడని ఆశ చిగురిచింది. దీంతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

సాక్షి, దర్శి (ప్రకాశం): దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలోని రెడ్డినగర్‌కు చెందిన మేడగం అశోక్‌రెడ్డి, జ్యోతి దంపతుల కుమారుడు 25 నెలల వయసున్న ఆరూష్‌రెడ్డి. జూన్‌ 24 తేదీన ఇంటి వద్ద ఆరుబయట ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. దీనిపై ముండ్లమూరు ఎస్‌ఐ అంకమ్మ కేసు నమోదు చేశారు. దర్శి డీఎస్పీ రాంబాబు, సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. పలు చోట్ల వెదికినా ఫలితం లేదు. దీంతో ప్రతి రోజు ఆరూష్‌ కోసం తల్లిదండ్రులు తమ బంధువుల గ్రామాలలో చుట్టు పక్కల పట్టణాలలో, తండాలలో, రైల్వే స్టేషన్లు, పోలీస్‌ స్టేషన్, ఇతర పట్టణాలలో వెదుకుతూనే ఉన్నారు.

32 రోజులు అయినా ఫలితం లేక పోవటంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని ముక్కోటి దేవతలను వేడుకున్నారు. తమ వంతుగా ఎస్పీని కలసి విన్నవించుకున్నారు. అదే రోజు డీఎస్పీతో మాట్లాడి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట బాలుడు జసిత్‌ గురువారం తల్లిదండ్రుల చెంతకు చేరడంతో ఆరూష్‌రెడ్డి తల్లిదండ్రుల్లో కొత్త ఆశలు చిగురించాయి. దీంతో గురువారం ఒంగోలు వచ్చి, జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను కలిసి, తమ బిడ్డ ఆచూకీ గుర్తించాలని విన్నవించుకున్నారు.

ఒడిశా వారి పైనే అనుమానం...
మొదటగా తల్లిదండ్రులు వెలు బుచ్చిన పలు అనుమానాల ప్రకారం పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఈ సమయంలో దర్శి కేంద్రంగా పలు పరీక్షలు రాయటానికి వచ్చిన ఒడిశాకు చెందిన వారిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదిశగా విచారణ చేస్తే ఫలితం ఉండొచ్చని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బదిలీలతో దర్యాప్తు జాప్యం..
బాలుడు అదృశ్యమైన సమయంలో ఉన్న పోలీస్‌ అధికారులు తర్వాత వరస బదిలీలు కావటంతో ఈ కేసు దర్యాప్తు జాప్యమైందని స్థానికులు భావిస్తున్నారు. కిడ్నాప్‌ సమయంలో ఉన్న ఎస్‌ఐ అంకమ్మ రావు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో రామక్రిష్ణ వచ్చారు. దర్శి డీఎస్పీ నాగరాజు బదిలీపై వెళ్లి ప్రకాశరావు వచ్చారు. దర్శి సీఐ శ్రీనివాసరావు బదిలీపై వెళ్లిన సీఐ కరుణాకర్‌రావు ఆయన వెళ్లి సీఐ ఎండీ మొయిన్‌ వచ్చారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

1
1/1

బాలునితో తల్లిదండ్రులు (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement