‘కేశోరాం’లో కార్మికుడి మృతి

Cement Factory Labour Accidentally Died In Karimnagar - Sakshi

సాక్షి, పాలకుర్తి(కరీంనగర్‌): పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌ కేశోరాం సిమెంట్‌ కర్మాగారంలో బుధవారం లిఫ్ట్‌ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి కొడారి నర్సింగం(42) అనే పర్మినెంట్‌ కార్మికుడు మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు, తోటికార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈసాలతక్కళ్లపల్లి గ్రామానికి చెందిన నర్సింగం కేశోరాం సిమెంట్‌ కర్మాగారంలో ఎలక్ట్రికల్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. ఉదయం షిఫ్ట్‌ విధులకు హాజరై సిమెంట్‌ మిల్లు వద్ద నాల్గో అంతస్తులో పని చేస్తుండగా ఉదయం సుమారు 10 గంటలకు టీ తాగేందుకు లిఫ్ట్‌ ద్వారా కిందకు దిగేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు 60 మీటర్ల ఎత్తు నుంచి కింద పడ్డాడు.

దీంతో అతని తలతోపాటు చేయి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటికార్మికులు, అధికారులు కంపెనీ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశికహరి, ప్రధాన కార్యదర్శి తోడేటి రవికుమార్‌లతోపాటు ఇతర నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కార్మికసంఘం నాయకులు, అధికారులతో కలిసి ప్రమాదం జరిగిన వీఆర్‌పీఎం లిఫ్ట్‌ ప్రాంతాన్ని, సిమెంట్‌ మిల్లు నాల్గో అంతస్తు పైకి ఎక్కి పరిశీలించి మృతుడి కుటుంబానికి  రూ.40లక్షలు ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

ఐదుగంటల పాటు ఉద్రిక్త వాతావరణం
కార్మికుడు నర్సింగం మృతితో కార్మికులు ఉదయం షిప్టు విధులను బహిష్కరించి కంపెనీ గేట్‌ ఎదుట నిరసనకు దిగారు. తొలుత యాజమాన్యం రూ.20లక్షలతోపాటు నర్సింగం కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈమేరకు కంపెనీ ప్లాంట్‌ హెడ్‌ రాజేశ్‌గర్గు ఈవిషయాన్ని కార్మికసంఘం నాయకులకు తెలుపగా అందుకు వారు ఒప్పుకోకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. కార్మికసంఘం నాయకులకు, అధికారులకు మధ్య పలుదఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో నాయకులు, కార్మికులు గేట్‌ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దాదాపు 5గంటల పాటు పలు దఫాలుగా కొనసాగిన చర్చల అనంతరం మృతుడి కుటుంబానికి రూ.33లక్షలు చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీంతో పాటు మృతుడి కుటుంబంలో ఒకరికి పర్మినెంట్‌ ఉద్యోగం, సంఘటనకు బాధ్యులైన వారిపై తగిన విచారణ నిర్వహించి చర్యలు తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరిస్తూ వ్రాతపూర్వకంగా ఒప్పందపత్రాన్ని అందజేశారు.

దీంతో కార్మికులు, నాయకులు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మికసంఘం అధ్యక్షుడు కౌశికహరి, ప్రధాన కార్యదర్శి తోడేటి రవికుమార్, జీడీనగర్, బసంత్‌నగర్, పాలకుర్తి సర్పంచులు సూర సమ్మయ్య, కట్టెకోల వేణుగోపాలరావు, జగన్, కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ముక్కెర శ్రీనివాస్, పాలకుర్తి వైస్‌ ఎంపీపీ ఎర్రం స్వామి, నాయకులు అయోధ్య సింగ్, తంగెడ అనిల్‌రావు, ముల్కల కొంరయ్య, అంతర్గాం జెడ్పీటీసీ నారాయణతోపాటు సమీప గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. కాగా మృతుడికి భార్య సరితతోపాటు ఇద్దరు కుమారులున్నారు, మృతుడి తల్లి సుశీల కంపెనీ ఎదుట పండ్ల షాపు నిర్వహిస్తోంది. అందరితో కలివిడిగా ఉండే నర్సింగం మృతితో ఈసాలతక్కళ్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అధికారుల నిర్లక్ష్యమే కారణం
కేశోరాం కర్మాగారంలో జరిగిన ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. కర్మాగారంలో ఐదో అంతస్తులు గల సిమెంట్‌ మిల్లు వద్ద కార్మికులు ఎక్కేందుకు, దిగేందుకు ఏర్పాటు చేసిన గల వీఆర్‌పీఎం లిఫ్ట్‌కు ఆపరేటర్‌ లేడని, లిఫ్ట్‌ కూడా సరిగ్గా పనిచేయడం లేదని ఒకచోట ఆగాల్సింది ఇంకో చోట ఆగుతోందని ఈవిషయాన్ని సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్‌ సరిగ్గా ఆగకపోవడం వల్లనే నర్సింగం అదుపుతప్పి కింద పడి   మృతిచెందాడని, వెంటనే సంఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top