
అలహాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడిని కాల్చిచంపడం ఉత్తరప్రదేశ్‌లోని తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బీఎస్పీ నేత రాజేశ్ యాదవ్‌ను అలహాబాద్ యూనివర్సిటీ ఎదురుగానే సోమవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటనతో భగ్గుమన్న బీఎస్పీ కార్యకర్తలు రోడ్లమీదకు వచ్చి హింసకు దిగారు. తమ నేత హత్యకు కారకులను వెంటనే అరెస్టుచేయాలంటూ రెండు బస్సులకు నిప్పుపెట్టారు. సమీపంలో ఉన్న ఆస్పత్రిపై దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి చేయి దాటకుండా అలహాబాద్‌లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.
పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం సోమవారం అర్ధరాత్రి సమయంలో రాజేశ్ యాదవ్ కొంతమందిని కలిసేందుకు యూనివర్సిటీ సమీపంలోని తారాచంద్ హాస్టల్‌కు వెళ్లారు. డాక్టర్ ముకుల్ సింగ్‌తో కలిసి అక్కడికి వెళ్లిన రాజేశ్ కొందరితో గొడవపడ్డాడు. దీంతో దుండగులు ఆయనపై దాడి చేశారు. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఆయనపై దుండగులు కాల్పులు జరిపారని ప్రత్యక్షసాక్షి ముకుల్ సింగ్ తెలిపారు. రాజేశ్ యాదవ్ హత్యతో అలహాబాద్‌లో బీఎస్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.