పాస్‌ కావాలంటే.. పైసలిస్తే చాలు

Bribe In ITI Nizamabad  - Sakshi

ఐటీఐలో వసూల్‌ రాజాలు

హాజరు శాతం తక్కువున్నా మామూళ్లు ఇస్తే సరి

అవినీతికి పాల్పడుతున్న ఐటీఐ నిర్వాహకులు

అక్రమాలకు కేరాఫ్‌  అడ్రస్‌ బషీరాబాద్‌ కళాశాల

మోర్తాడ్‌ : పారిశ్రామిక రంగానికి సంబంధించి వివిధ కోర్సుల్లో శిక్షణనిచ్చేందుకు కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌లో నెలకొల్పిన ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) అక్రమాలకు, అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. వివిధ కోర్సుల్లో శిక్షణ కోసం అడ్మిషన్‌ పొందిన అభ్యర్థులకు హాజరు శాతం తక్కువగా ఉంటే పరీక్షలు రాయనివ్వమనే నెపంతో కొందరు ఫ్యాకల్టీ(శిక్షకులు) అందినకాడికి దండుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సెమిస్టర్‌ పరీక్షల్లో అభ్యర్థులు పాస్‌ కావాలంటే తాము వేసే మార్కులకు ఎంతో కొంత ఇచ్చుకోవాల్సిందే అని దబాయించి మరీ వసూళ్లకు పాల్పడినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీఐ కోర్సులలో శిక్షణ పొందినట్లు సర్టిఫికెట్‌లు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకా శం కలుగడంతో పాటు స్వయం ఉపాధికి బ్యాం కుల నుంచి రుణం పొందే అవకాశం ఉంది.

అంతేకాకుండా గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగ అవకాశాలకు ఐటీఐ సర్టిఫికెట్‌లు ఉంటే వేతనాలు ఎక్కువ లభించే అవకాశం ఉంది. పైన పేర్కొన్న అంశాల ను దృష్టిలో ఉంచుకుని ఎంతో మంది అభ్యర్థులు బషీరాబాద్‌ ఐటీఐలో అడ్మిషన్‌లు తీసుకున్నారు.  

మూడు జిల్లాలకు చెందినవారు.. 

ఇక్కడ కోబా, డ్రెస్‌ మేకింగ్, ఫిట్టర్, డీజిల్‌ మెకానిజం, ఎలక్ట్రిషియన్, సివిల్, వెల్డర్‌ విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు చెందిన దాదాపు 300ల మంది ఈ కోర్సులలో ప్రవేశం పొంది శిక్షణ పొం దుతున్నారు. ఇటీవల సెమిస్టర్‌ పరీక్షలు ప్రారం భం కాగా మరి కొన్ని రోజుల వరకు సాగనున్నా యి. విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలు కీలకం కావ డం అక్రమార్కులకు వరంగా మారింది.

శిక్షణ సమయంలో తరగతులకు హాజరుకాని విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలు రాసేందుకు అవకాశం లేదు. అయితే కొంత మంది అభ్యర్థులు అడ్మిషన్లు తీసుకున్నా తమ కుటుంబాల ఆర్థిక స్థితి బాగా లేక ఏదో ఒక పని చేసుకుంటూ పరీక్షలకు మాత్ర మే హాజరవుతున్నారు. మరి కొందరు మాత్రం తాము అడ్మిషన్‌ పొందిన కోర్సులకు సంబంధించి తమ గ్రామాల్లోనే పని చేసుకుంటూ పరీక్షలకు హాజరు కావాలని భావిస్తున్నారు.

కోబా, డ్రెస్‌ మేకింగ్, సివిల్‌ రంగాల్లో శిక్షణ కోసం అడ్మిషన్లు తీసుకున్న వారు మాత్రం రెగ్యులర్‌గా వస్తుంటా రు. ఇది ఇలా ఉండగా కొన్ని కోర్సులకు సంబంధించి థియరీ మాత్రమే చెబుతుండగా ప్రాక్టికల్స్‌ కు సంబంధించి పరికరాలు లేక పోవడంతో అభ్యర్థులు తరగతులకు హాజరుకాకుండా ఉన్నారు.  

హాజరుశాతం వంక చూపుతూ.. 

అభ్యర్థుల అవసరాన్ని అవకాశంగా తీసుకున్న అక్రమార్కులు హాజరుశాతం వంక చూపుతూ పరీక్షలు రాసేందుకు అభ్యంతరం చెబుతున్నారు. దీంతో కొంత మంది అభ్యర్థులు హాజరు శాతం కోసం రూ.వెయ్యి నుంచి రూ.1,500ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. అలాగే సెమిస్టర్‌ పరీక్షల్లో పాస్‌ కావడానికి అవసరమైన మార్కులు వేయాలన్నా, మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వడానికి ఒక్కో అభ్యర్థి నుంచి అక్రమార్కులు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సెమిస్టర్‌ పరీక్షలకే కాకుండా ప్రాక్టికల్స్‌ పరీక్షల్లోను ఉత్తీర్ణత చేసేందుకు కూడా వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇలా ఒక్కో విద్యార్థి నుంచి రూ.3వేల వరకు వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఏటా అక్రమార్కులు అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో దండుకుంటూనే ఉన్నారు. తాము అడిగినంత ఇచ్చుకోనివారిని ఇబ్బందులకు గురి చేసినట్లు పలువురు ఆరోపించారు.

అక్రమార్కులను ప్రశ్నించే ధైర్యం చేస్తే తమను టార్గెట్‌ చేస్తారని అభ్యర్థులు వాపోతున్నారు. బషీరాబాద్‌ ఐటీఐలో కొన్నేళ్ల నుంచి అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో అక్రమార్కులకు అడ్డుకట్ట వేసినవారు లేరు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బషీరాబాద్‌ ఐటీఐలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని పలువురు కోరుతున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top