మార్కాపురంలో పేలిన బాంబు

Bomb Blast in Markapuram Prakasam - Sakshi

 ఒకరికి గాయాలు

ఉలిక్కి పడిన పట్టణ ప్రజలు

ప్రకాశం, మార్కాపురం టౌన్‌: పట్టణంలోని తర్లుపాడు రోడ్డు మాగుంట సుబ్బరామిరెడ్డి మెమోరియల్‌ పార్కు సమీప మెయిన్‌ రోడ్డులో ఆదివారం రాత్రి బాంబు పేలడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. దుండగులు నలుగురు ఆటోలో ప్రయాణిస్తూ పార్కు సమీపంలో ఆగారు. అదే సమయంలో వారి నుంచి బాంబు జారి నేలపై పడింది. ఆ సమయంలో అటుగా మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న ఎం.ఖాశింపీరా తన కుమార్తెతో షాపింగ్‌ కోసం పట్టణంలోకి వస్తున్నాడు. ఈయన పంచాయతీరాజ్‌ ఈఈ వాహనానికి డ్రైవర్‌గా పని చేస్తున్నారు. బాంబు పేలడంతో డ్రైవర్‌ ఎడమ కాలికు బాంబులోని గాజు ముక్కలు గుచ్చుకోవడంతో గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స కోసం స్థానిక ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. స్వల్ప గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి పరిశీలించి వివరాలు సేకరించారు. బాంబు పేలిన సమయంలో ఆటోలో ఉన్న దుండగులు చెల్లాచెదురుగా పరారైనట్లు తెలుస్తోంది.

బాంబు కలకలం
2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 11న ముగియడం.. పాతకక్షల నేపథ్యంలో పట్టణంలో బాంబు వేసేందుకా లేక ఇతర ప్రాంతాలకు తరలించేందుకా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇటీవల మార్కాపురం మండలంలోని పలు గ్రామాల్లో çఘర్షణలు చోటు చేసుకోవడంతో వీటిని వినియోగించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకుని తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో పేలాయా అనే సందేహం నాయకులు, ప్రజల్లో వ్యక్తమవుతోంది. బాంబు పేలిన సమీపంలో వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు స్వగృహాలకు వెళ్లే మార్గంలో సంఘటన చోటుచేసుకుంది. నాయకులు అలర్ట్‌గా ఉండి భద్రత చర్యలు తీసుకుంటున్నారు. సదరు సంఘటనపై సీఐ శ్రీధర్‌రెడ్డితో మాట్లాడగా బాంబా, లేక గాజు సీసాలో ద్రావణంతో కిందపడి పేలి ఉంటుందని భావిస్తున్నాం. పేలిన సమయంలో శబ్ధంతో పాటు లైటింగ్‌ వచ్చినట్లు ఆ ప్రాంత ప్రజలు తమ దృష్టికి తెచ్చారు. సదరు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నాం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top