అర్ధరాత్రి అలజడి | Bank Theft Case In Nellore | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి అలజడి

Jul 24 2018 9:23 AM | Updated on Oct 20 2018 6:23 PM

Bank Theft Case In Nellore - Sakshi

బ్యాంక్‌ ఎదుట సిబ్బందితో మాట్లాడుతున్న డీఎస్పీ కె. శ్రీనివాసాచారి

నెల్లూరు (క్రైమ్‌): బ్యాంక్‌లో దొంగలు పడ్డారని అర్ధరాత్రి ఆటోమెటిక్‌ మెసేజ్‌లు బ్యాంక్‌ ఉన్నతాధికారులకు వెళ్లింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అలాంటిదేమి లేదని తెలియడంతో వెనుదిరిగారు. ఈ ఘటన కేవీఆర్‌పెట్రోల్‌ బంకు సమీపంలోని ఎస్‌బీఐ పర్సనల్‌ బ్యాంకింగ్‌ బ్రాంచ్‌లో ఆదివారం అర్ధరాత్రి  జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. కేవీఆర్‌ పెట్రోల్‌బంకు సమీపంలో స్టేట్‌బ్యాంక్‌ఆఫ్‌ ఇండియా పర్సనల్‌ బ్యాంకింగ్‌ బ్రాంచ్‌ ఉంది. బ్యాంకు అధికారులు దొంగతనాలు నియంత్రణకు బ్యాంక్‌ లోపల క్యాష్‌చెస్ట్‌ల వద్ద అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు, ఆటోమెటిక్‌ మెసేజ్‌ (వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌), కాల్‌ సెండింగ్‌ పరికరాన్ని ఏర్పాటు చేశారు. క్యాష్‌చెస్ట్‌ వద్దకు ఎవరైనా వెళ్లినా, దొంగతనానికి యత్నించినా, లేదా దాని ముందుగా ఏదైనా (గాలికి పేపర్లు పడినా, ఎలుకలు తదితరాలు వెళ్లినా) కదలికలు జరిగినా వెంటనే బ్యాంక్‌ ఉన్నతాధికారుల సెల్‌ఫోన్‌కు సమాచారం వెళుతుంది.

ఫోను సైతం మోగుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో బ్యాంక్‌లో దొంగలు ఉన్నారన బ్యాంక్‌ డిప్యూటీ మేనేజర్‌ అకౌంట్స్‌ సుజాతకు, చీఫ్‌ మేనేజర్‌ వివేకానందకు మెసేజ్‌లు వెళ్లాయి. దీంతో వారు డయల్‌ 100కు ఫిర్యాదు చేశారు. రాత్రి జనరల్‌ చెకింగ్‌ విధులు నిర్వహిస్తున్న కె. శ్రీనివాసాచారికి డయల్‌ 100 సిబ్బంది సమాచారం అందజేయడంతో వెంటనే ఆయన రాత్రి విధుల్లో ఉన్న నార్త్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వేమారెడ్డితో పాటు నగరంలోని సిబ్బందిని, అన్నీ పోలీస్‌స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లను అప్రమత్తం చేశారు. వేమారెడ్డిని, దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌ సిబ్బందిని హుటాహుటిన బ్యాంక్‌ వద్దకు రమ్మని ఆదేశించి విషయాన్ని జిల్లా ఎస్పీ పీహె చ్‌డీ రామకృష్ణ, క్రైం ఓఎస్‌డీ టీపీ విఠలేశ్వర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని బ్యాంక్‌ ఉద్యోగులతో కలిసి బ్యాంకు తాళాలను తెరిపించారు. బ్యాంక్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. లోపల ఎవరూ లేకపోవడం, క్యాష్‌ చెస్ట్‌ వద్ద ఎలాంటి  ఘటనలు చోటు చేసుకోకపోవడాన్ని గుర్తించారు. ఎలుకలు అటుగా వెళ్లడం ద్వారా మెసేజ్‌ వచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అప్పటికే నగరంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న సిబ్బంది అందరూ అనుమానాస్పదంగా తారసపడిన వ్యక్తులను ఆపి వారి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. బ్యాంక్‌ వద్ద సెక్యూరిటీ గార్డ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులు డీఎస్పీ కె. శ్రీనివాసాచారి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement