ముంబై అలజడి; వినయ్‌ దూబే అరెస్ట్‌

Bandra Migrant Crisis: Mumbai Police Detains Vinay Dubey - Sakshi

ముంబై: వలస కార్మికుల ఆందోళనకు కారణమైన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆన్‌లైన్‌లో అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణలతో వినయ్‌ దూబే అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘ఇంటికి వెళ్లిపోదాం’ అంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం చేయడం వల్లే వలస కార్మికులు భారీ సంఖ్యలో బాంద్రా రైల్వేస్టేషన్‌కు తరలివచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ద్వారా వలస కార్మికులను అతడు రెచ్చగొట్టినట్టు వెల్లడించారు.

తనను తానుగా కార్మికుల నాయకుడిగా చెప్పుకుంటున్న వినయ్‌ దూబే.. వలస జీవులు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెట్టాడని చెప్పారు. వలస కార్మికులు తిరిగి వెళ్లేందుకు సరిపడా రవాణా సౌకర్యాలు కల్పించకపోతే భారీ ర్యాలీగా ఉత్తర భారత్‌కు కాలినడకన బయలుదేరతామని ఫేస్‌బుక్‌ వీడియోలో అతడు హెచ్చరించాడు. అతడి మాటలు నమ్మి అమాయక కార్మికులు మంగళవారం బాంద్రా రైల్వేస్టేషన్‌ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారని పోలీసులు వివరించారు. వినయ్‌ దూబేపై ఐపీసీ 117, 153ఏ, 188, 269, 270, 505(2), సెక్షన్‌ 3 కింద కేసులు నమోదు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచగా ఈ నెల 21 వరకు పోలీసు కస్టడీ విధించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆంక్షలు ఉల్లఘించారన్న కారణంతో 1000 మందిపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

సీఎం ఉద్ధవ్‌ వార్నింగ్‌
లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు. వలస కార్మికులను తప్పుదారి పట్టించి బాంద్రా రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చారని తెలిపారు. ఏప్రిల్‌ 14 తర్వాత రైళ్లు నడుస్తాయని తప్పుడు ప్రచారం చేయడంతో వారందరూ బాంద్రా రైల్వేస్టేషన్‌ వచ్చారని చెప్పారు. వలస కార్మికులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత వారందరికీ స్వస్థలాలకు వెళ్లే ఏర్పాటు చేస్తామని హామీయిచ్చారు. 

లాక్‌డౌన్‌: ఉండలేం.. ఊరెళ్లిపోతాం!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top