జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో.. లేచి నిలబడలేదని..

Attack on Hero in Cinema Theatre Hyderabad - Sakshi

సినిమా హాల్‌లో ప్రేక్షకుడి దాడి

సినీనటుడు కార్తీక్‌కు గాయాలు  

బంజారాహిల్స్‌: జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో సినిమా థియేటర్‌లో లేచి నిలబడలేదని తోటి ప్రేక్షకుడు ఓ యువకుడిపై దాడికి పాల్పడిన సంఘటన బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–2లోని ఆర్కే సినీప్లెక్స్‌  పీవీఆర్‌ సినిమాస్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్రపురి కాలనీకి చెందిన సినీనటుడు కార్తీక్‌ అడుసుమిల్లి గురువారం ఉదయం ఆర్కే సినీప్లెక్స్‌ పీవీఆర్‌ సినిమాస్‌లో హిప్పీ సినిమా చూసేందుకు వచ్చాడు.సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించగా ప్రతి ఒక్కరూ గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. కార్తీక్‌ మాత్రం సీట్లోనే కూర్చున్నాడు. జాతీయ గీతం పూర్తయిన తర్వాత పక్క సీట్లో కూర్చున్న పద్మారావునగర్‌కు చెందిన వ్యాపారి ఆర్‌వీఎల్‌ శ్వేత్‌ హర్ష్ ఇదేం పద్ధతి అంటూ కార్తీక్‌ను నిలదీశాడు. 

దీన్ని సీరియస్‌గా తీసుకున్న కార్తీక్‌ అది తన ఇష్టమని, అడగడానికి నువ్వు ఎవరివంటూ అసభ్యంగా అతడిని దూషించాడు. దీంతో ఆగ్రహానికి లోనైన శ్వేత్‌ హర్ష్ కార్తీక్‌పై దాడి చేయడంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు ఘర్షణ జరిగింది. దీంతో థియేటర్‌ నిర్వాహకులు, సెక్యూరిటీ గార్డులు అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేశారు. ఐదు నిమిషాల తర్వాత కార్తీక్‌ మళ్లీ లేచి నన్నే కొడతావా అంటూ దూషించడంతో   శ్వేత్‌ హర్ష్ మరోసారి అతడిపై దాడి చేయగా అక్కడే ఉన్న కార్తీక్‌ భార్య అతడిని అడ్డుకుంది. మాటామాటా పెరిగి వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కార్తీక్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై, తన భార్యపై దాడి చేసిన శ్వేత్‌ హర్ష్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో కూర్చోవడమే కాకుండా ఇదేమిటని అడిగినందుకు తనను  దూషించిన కార్తీక్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా శ్వేత్‌ హర్ష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top