ఏమార్చి... ఏటీఎం కార్డులు మార్చి

arrested for duping people at ATMs - Sakshi

సాయం చేస్తానని ఏటీఎం కార్డులు మార్చి నగదు తస్కరిస్తున్న దొంగ అరెస్ట్‌

రూ.1.20 లక్షలు, సెల్‌ ఫోన్‌ స్వాధీనం నిందితుడు ఉత్తరప్రదేశ్‌ వాసి

ఆనందపురం(భీమిలి): అతను ఏటీఎం కేంద్రాల వద్ద మాటు వేస్తాడు... కేంద్రాలకు వచ్చి నగదు తీసుకునేందుకు సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారితో మాటలు కలుపుతాడు... సాయం చేస్తానని నమ్మించి వారి వద్ద నుంచి కార్డు తీసుకుని కొంతసేపు ప్రయత్నిస్తాడు... కార్డు పనిచేయడం లేదని చెప్పి అప్పటికే తన వద్ద ఉన్న నకిలీ కార్డుని సదరు వ్యక్తికి ఇచ్చేసి అసలు కార్డుతో అక్కడి నుంచి ఉడాయిస్తాడు. అనంతరం ఆ కార్డు సాయంతో ఖాతాలోని డబ్బులన్నీ తస్కరిస్తాడు. ఇదీ సులువుగా డబ్బు సంపాదించేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగేంద్రసింగ్‌ ఎంచుకున్న మార్గం. కొంత కాలం సాఫీగా దొంగతనాలు సాగినా, అతనిపై పోలీసులు గట్టి నిఘా ఉంచి అరెస్ట్‌ చేసి జైలుకి తరలించారు.

మండలంలోని వెల్లంకితో పాటు పలు చోట్ల చోరీకి పాల్పడిన దొంగను స్థానిక పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ ఆర్‌.గోవిందరావు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ప్రతాప్‌ఘర్‌ జిల్లా పూరి పాండేక పూర్వ గ్రామానికి చెందిన యోగేంద్ర సింగ్‌ (31) తన భార్యతో కలిసి కొంత కాలం క్రితం బతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలోని ఓ పరిశ్రమలో ఫ్యాబ్రికేషన్‌ పనిలో చేరాడు. భార్యను కూడా అక్కడే పనిలోకి కుదుర్చాడు. ఇదిలా ఉండగా పని ద్వారా వచ్చే ఆదాయం సరిపోక పోవడంతో సులువుగా డబ్బు సంపాదించాలని ఆలోచన చేసి ఏటీఎం కేంద్రాలను ఎంచుకున్నాడు. కొన్నాళ్లు క్రితం విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద గల ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేయడానికి అవస్థలు పడడం చూసి తాను సాయం చేస్తానంటూ వెళ్లి ఏటీఎం కార్డుతో సొమ్ము డ్రా చేసినట్టు నటించి కార్డు పనిచేయలేదని చెప్పి అసలు ఏటీఎం కార్డుని తన వద్దు ఉంచుకొని నకిలీ కార్డుని ఆ వ్యక్తి చేతిలో పెట్టి చల్లగా జారుకున్నాడు. అనంతరం ఆ ఏటీఎం కార్డుతో రూ.40 వేలు డ్రా చేశాడు. దీంతో అప్పట్లో బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

పట్టించిన సీసీ కెమెరా ఫుటేజీ
గత ఏడాది నవంబర్‌ 17న మండలంలోని వెల్లంకి గ్రామానికి చెందిన గొలగాని అప్పలరాజు అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అప్పటికే అక్కడ యోగేంద్ర సింగ్‌ మాటు వేసి ఉన్నాడు. డబ్బులు డ్రా చేయడానికి అప్పలరాజు ఇబ్బందులు పడడాన్ని గమనించిన యోగేంద్ర సింగ్‌ తాను సాయం చేస్తానని చెప్పి ఎప్పటిలాగే కార్డులో సమస్య ఉందని, డబ్బులు రావడం లేదని చెప్పి నకిలీ ఏటీఎం కార్డు అప్పలరాజుకి ఇచ్చి అసలు కార్డుతో జారుకున్నాడు.

ఆ కార్డుతో యోగేంద్ర సింగ్‌ నాలుగు రోజులలో ఆన్‌లైన్‌లో వివిధ వస్తువులు కొనుగోలు చేయడంతో పాటు కొంత సొమ్ము డ్రా చేశాడు. ఇదిలా ఉండగా ఆన్‌లైన్‌లో తాను వస్తువులు కొనుగోలు చేసిన్టటు అప్పలరాజు సెల్‌కు సమాచారం రావడంతో బ్యాంక్‌కు వెళ్లి విచారించగా రూ.1.52 లక్షలు తన ఖాతా నుంచి మళ్లిపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీఐ ఆర్‌.గోవిందరావు ముందుగా ఏటీఎం కేంద్రంలోని సీసీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించారు. అతనిపై పాత నేరాలు కూడా ఉన్నట్టు రూఢీ చేసుకున్నారు. ఎస్‌ఐ గణేష్‌ ఇతర పోలీసు సిబ్బంది నిఘా ఏర్పాటు చేసి మంగళవారం విశాఖ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న యోగేంద్ర సింగ్‌ని అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి రూ.1.20 లక్షలు నగదు, ఒక సెల్‌ ఫోన్‌ని స్వాధీనం చేసుకొని కోర్టుకి తరలించారు. గతంలో గాజువాకతోపాటు పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, వివరాలు రావాల్సి ఉందని సీఐ తెలిపారు. సీఐ గోవిందరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top