న్యాయం కోసం మృతదేహంతో ఆందోళన

Anxiety with the corpse for justice - Sakshi

పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయింపు

సర్ది చెప్పిన డీఎస్పీ సౌమ్యలత

శాంతించిన మృతుని కుటుంబీకులు  

మక్కువ: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ ముందు రహదారిపై న్యాయం కోసం మృతదేహంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చేసిన సంఘటన మంగళవారం చోటు చేసుకొంది. తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించడంతో డీఎస్పీ సౌమ్యలత వచ్చి వారిని శాంతింపజేశారు.

చివరకు మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శాంతించారు. వివరాల్లోకి వెళ్తే...మండలంలోని సరాయివలస గ్రామానికి చెందిన గులిపల్లి సన్యాసినాయుడు ఈ నెల 5న గ్రామ సమీపంలోని వెంగళరాయసాగర్‌ కాలువ నుంచి తమ పంట పొలానికి నీరు కట్టేందుకు వెళ్లాడు.

తరువాత కనిపించని సన్యాసినాయుడు ఈ నెల 9న విగతజీవుడై కనిపించిన విషయం పాఠకులకు విదితమే. దీనిపై ఎస్‌ఐ వెలమల ప్రసాదు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మంగళవారం సాలూరు సీహెచ్‌సీకి పోస్టుమార్టం కోసం తరలించారు. తరువాత సాలూరు నుంచి సరాయివలస తీసుకువచ్చారు.  

అనుమానంతోనే...

అంతా జరిగిన తరువాత సన్యాసినాయుడు మృతిపై కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. కాలువలో మృతదేహం బొర్లా పడి ఉండడంతో కుటుంబ సభ్యులు హత్యకు గురై ఉంటాడని అనుమానిస్తున్నారు.

దీంతో మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చిన సమయంలో పోస్టుమార్టం నివేదికలో గాయాల్లేవని, కేసు మూసి వేస్తారన్న అనుమానంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహించి పోలీస్‌స్టేషన్‌ వద్దకు మృతదేహంతో తరలివచ్చారు.

మంగళవారం మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌ వద్దే ఆటోలో ఉంచి మిగతా వారంతా పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. నిందితులను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. ఈ క్రమంలో పోలీసులకు, మృతుని కుటుంబ సభ్యులకు మధ్య వాదులాట చోటు చేసుకొంది.

ఎస్‌ఐ న్యాయం చేస్తామని చెప్పినా వినకపోవడంతో బొబ్బిలి డీఎస్పీ సౌమ్యలత, సీఐ సయ్యద్‌ మహ్మద్‌ మక్కువ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించి వెనుదిరిగారు.

పోలీస్‌స్టేషన్‌ వద్ద బైఠాయించిన ఆందోళనకారులతో మాట్లాడుతున్న సీఐ మహమ్మద్‌ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top