పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు 

Alekhya Funeral Completed - Sakshi

ఐదుగురిపై కేసు

రాయికల్‌(జగిత్యాల): రాయికల్‌లో మంగళవారం అనుమానాస్పదంగా మృతిచెందిన అయిత అలేఖ్య(27)కు బుధవారం కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబసభ్యులు, వందలాది మంది గ్రామస్తులు తరలివచ్చారు. పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కాగా మంగళవారం అర్ధరాత్రి వరకు సాగిన మృతురాలి కుటుంబసభ్యుల ఆందోళనతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. రాత్రి ఒంటి గంట సమయంలో డీఎస్పీ భద్రయ్య హామీతో నాటకీయ పరిణామాల మధ్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

వివరాలు బంధువులు, స్థానికుల కథనం ప్రకారం. రాయికల్‌ మండలం కట్కాపూర్‌కు చెందిన అలేఖ్య వివాహం ఐదేళ్ల క్రితం మండల కేంద్రానికి చెందిన అయిత నరేందర్‌తో జరిగింది. వివాహ సమయంలో సుమారు రూ.10 లక్షల కట్నకానుకలు అప్పజెప్పారు. కాగా అదనపు కట్నం కోసం మామ, అత్త, మరిది తరచూ వేదించేవారు. ఈక్రమంలోనే కుటుంబసభ్యులే మంగళవారం అలేఖ్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి బంధువులు, స్థానికులు ధర్నాకు దిగారు.

హంతకులను శిక్షించాలని,  ఆస్తిపాస్తులను అనాథాశ్రమానికి రాయాలని కోరుతూ వందలాది మంది మంగళవారం రాత్రి ఒంటి గంట వరకు ఆందోళనకు దిగారు. జగిత్యాల డీఎస్పీ భద్రయ్య అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. డీఎస్పీ హామీతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు తీసుకెళ్లారు. బుధవారం అలేఖ్య అంత్యక్రియలు నేపథ్యంలో కట్కాపూర్, తాట్లవాయికి చెందిన సుమారు వెయ్యి మంది తండావాసులు తరలివస్తున్నారనే సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు పెట్టారు.

జిల్లాలోని 8 మంది ఎస్సైలు మండలంలోని రామాజీపేట, తాట్లవాయి, ఆలూరు, రాయికల్‌లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జగిత్యాల నుంచి అలేఖ్య మృతదేహాన్ని పోలీసుల బందోబస్తు మధ్య నేరుగా శ్మశానవాటికకు తీసుకొచ్చారు. మృతురాలి తండ్రి భూమన్న చితికి నిప్పంటించగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆశ్రునివాళి మధ్య అలేఖ్యకు కన్నీటి వీడ్కోలు పలికారు.  

ఐదుగురిపై కేసు  

అలేఖ్య భర్త అయిత నరేందర్, అత్త అయిత రమ, మామ అయిత రాజన్న, మరిది అయిత నాగరాజు, చిన్నమామ అయిత శివకుమార్‌పై హత్య, అదనపు కట్నం కేసులు నమోదు చేసినట్లు ఎస్సై కరుణాకర్‌ తెలిపారు. వీరు పోలీసుల అదుపులో ఉన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top