మరో రెండేళ్లు జీఎస్‌టీ, నోట్ల రద్దు దెబ్బ! | Sakshi
Sakshi News home page

మరో రెండేళ్లు జీఎస్‌టీ, నోట్ల రద్దు దెబ్బ!

Published Mon, Dec 11 2017 2:28 AM

yv reddy on De monetization - Sakshi

ముంబై: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌), వస్తు–సేవల పన్ను(జీఎస్‌టీ) అమలుతో పాటు బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండిబకాయిల ప్రతికూల ప్రభావం ఆర్థిక వ్యవస్థపై మరో రెండేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతే అధిక వృద్ధి బాటలోకి పయనించవచ్చని అంచనా వేశారు. వీకెండ్‌లో ఇక్కడ కొంతమంది మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధి రేటు అంచనాలను వెల్లడించడం కష్టసాధ్యమైన విషయం. మళ్లీ మన ఆర్థిక వ్యవస్థ వాస్తవ సామర్థ్యానికి అనుగుణంగా 7.5–8 శాతం వృద్ధిని ఎప్పటికల్లా అందుకుంటుందనేది ఇప్పుడే చెప్పలేం. వచ్చే రెండేళ్లలో మాత్రం ఇది సాధ్యం కాదని భావిస్తున్నా. డీమోనిటైజేషన్, నోట్ల రద్దు షాక్‌ల కారణంగా వృద్ధి మందగమనం నెలకొంది. అయితే, వీటివల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే సమస్యలు తప్పవు. ప్రయోజనాలు భవిష్యత్తులో లభిస్తాయి.

ఇవి ఏమేరకు ఉంటాయి, ఎన్నాళ్ల తర్వాత అనేది ఇక్కడ ప్రధానమైన అంశం’ అని వైవీ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్‌బీఐ గవర్నర్‌గా తన హయాంలో ముడిచమురు ధరల భారీ తగ్గుదల కారణంగా ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం దాదాపు మూడేళ్ల పాటు కొనసాగిందని చెప్పారు. అయితే, ఇప్పుడు జీఎస్‌టీ, డీమోనిటైజేషన్, బ్యాంకుల్లో భారీ మొండిబకాయిల వల్ల తలెత్తిన ప్రతికూల ప్రభావాలు వృద్ధి రేటును దెబ్బతీస్తున్నాయని వైవీ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement