ఇలా చేయకపోతే.. మీ పాన్‌ రద్దు | Sakshi
Sakshi News home page

ఇలా చేయకపోతే..మీ పాన్‌ రద్దు

Published Fri, Feb 8 2019 2:06 PM

Your PAN Card Might be Cancelled If You Fail to do This - Sakshi

న్యూఢిల్లీ : మీరు ఆదాయ పన్ను రిటర్న్స్‌ దాఖలు  చేస్తారా? పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేశారా. చేయకపోతే త్వరపడండి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలులో పాన్‌కార్డు, ఆధార్‌ లింకుచేయకపోతే  పాన్‌కార్డు రద్దయ్యే ప్రమాదం ఉంది.  ఇన్‌కం టాక్స్‌ రిటర్నలతో అను సంధానం కాని ప్యాన్‌లను రద్దుచేస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు  (సిబిడిటి) ఛైర్మన్‌ సుశీల్‌ చంద్ర తాజాగా వెల్లడించారు. ఆధార్‌, పాన్‌కార్డు నంబర్ల లింకింగ్‌కు గడువు  ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో  సిబిడిటి ఛైర్మన్‌  ఈ హెచ్చరిక  చేశారు. 

బయోమెట్రిక్‌ ఐడి ఆధార్‌ను పాన్‌కార్డుతో తక్షణమే లింక్‌చేయాలని సిబిడిటి ఛైర్మన్‌  తెలిపారు. అసోచామ్‌ సదస్సులో పాల్గొన్న సుశీల్‌చంద్ర పాన్‌ ఆధార్‌ లింకింగ్‌ తప్పనిసరి  అని స్పష్టం చేశారు. ఐటిశాఖ ఇప్పటివరకూ 42 కోట్ల పాన్‌ నెంబర్లను జారీచేయగా, వీటిలో 23 కోట్ల పాన్‌కార్డులు మాత్రమే లింక్‌ అయ్యాయని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వచ్చే మార్చి 31వ తేదీలోపు లింక్‌ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆధార్‌ను పాన్‌కార్డుతో లింక్‌చేస్తే పాన్‌కార్డును బ్యాంకు ఖాతాతో లింక్‌ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.  ఇలా చేయడం వల్ల సంక్షేమపథకాలు అర్హులైన వ్యక్తులకు అందుతున్నాయా లేదా అన్నది కూడా తెలుసుకునే వీలుంటుందన్నారు. 

 కాగా సుప్రీంకోర్టు ఆదాయపు పన్ను రిటర్నుల్లో విధిగా ఆధార్‌ను పాన్‌తో లింక్‌చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాంకు ఖాతాలు,  మొబైల్ సేవలకు పాన్‌ లింకింగ్‌ తప్పనిసరి కాదు.  

Advertisement
Advertisement