షావోమి మరో విప్లవం : ఈ ఫోన్‌కు మీరే పేరు పెట్టండి!

Xiaomi Reveals Fold-in-Three Smartphone - Sakshi

చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి మరోసారి విప్లవాత్మక ఆవిష్కారానికి నాంది పలికింది. శాంసంగ్‌, ఎల్‌జీ లాంటి దిగ్గజ సంస్థలు ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆవిష్కరణకు అష్టకష్టాలు పడుతోంటే స్మార్ట్‌ఫోన్‌ సంచలనం ఏకంగా మూడు స్క్రీన్లతో డబుల్‌ ఫోల్డబుల్‌ డివైస్‌ను పరిచయం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మడిచివేసేందుకు అనువైన మూడు స్క్రీన్ల మొబైల్‌ని రిలీజ్ చేసింది. ఈ మేరకు షావోమి సహ వ్యవస్థాపకుడు లిన్-బిన్ చైనా వెబ్‌సైట్ వైబోలో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు.  

టాబ్లెట్ సైజులో ఉండే ఈ ఫోల్డబుల్‌ మొబైల్ విశేషం ఏమిటంటే...ఈ ఫోన్‌ను తెరచి..ఫోల్డ్ చేయగానే చిన్న సెంట్రల్ డిస్‌ప్లే కనబడుతుంది. మరోసారి ఫోల్డ్‌ చేస్తే లోపల మరో రెండు స్క్రీన్స్ కనిపిస్తాయి.  అలాగే మడిచివేసిన స్క్రీన్‌లోని భాగాలు డీ-యాక్టివేట్ అయిపోయి తిరిగి యధాతధ స్థితికి చేరుకుంటాయట. అయితే వాటిని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు. మరోవైపు ఈ డివైస్‌లోని ఇతర ఫీచర్లు, కెమెరా గురించి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు.  ఫ్లెక్సిబుల్ ఫోల్దింగ్ స్క్రీన్ టెక్నాలజీతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తాము ఇలాంటి ఫోన్‌ని డెవలప్ చేశామని లిన్-బిన్ తెలిపారు.

చైనా యాపిల్‌గా పిలుస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రాథమికంగా ఇంజనీరింగ్ మోడల్‌లో ఉందనీ, మరింత అభివృద్ది పరుస్తామని తెలిపారు. అలాగే డిమాండ్ ఆధారంగా వీటిని ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రస్తుతం షావోమీ డ్యుయెల్ ఫ్లెక్స్, షావోమీ మిక్స్ ఫ్లెక్స్ అనే పేర్లను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. అంతేకాదు ఇంకా మార్కెట్లోకి రాని ఈ త్రీ స్క్రీన్ ఫోన్‌కి ఎవరైనా పేరు పెట్టవచ్చునని లిన్ ఆహ్వానించారు. అందుకే ఈ ఫోన్‌ను అందరికీ పరిచయం చేస్తున్నట్టు చెప్పారు. కామెంట్లు, లైకుల ఆధారంగా, అందరికీ నచ్చితే.. భవిష్యత్తులో భారీ  సంఖ్యలో వీటిని తయారు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top