ఏడాది క్రితమే పీఎన్‌బీ స్కాం వెలుగులోకి..

Whistleblower Hari Prasad SV had alerted PMO of possible PNB scam in a 2016 letter - Sakshi

నేడు పేపర్లు, టీవీల్లో మేజర్‌ వార్త ఏదైనా ఉంది అంటే అది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణమే. వేల కోట్ల రూపాయల నగదును దోచుకున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ విదేశాలకు పారిపోయారు. దేశీయ బ్యాంకింగ్‌ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా ఇది వెలుగులోకి వచ్చింది. విజయ్‌మాల్యా, సుబ్రతారాయ్‌, సత్యం రామలింగ రాజులను మించి నీరవ్‌ మోదీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. అయితే ఈ స్కాంపై గతేడాదే అథారిటీలకు ముందస్తు హెచ్చరికలు వెళ్లినప్పటికీ, వారి పట్టించుకోలేదని తెలుస్తోంది.

2016 జూలైలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త హరి ప్రసాద్‌ గతేడాదే ఈ కుంభకోణాన్ని బయటపెట్టారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ కూడా రాశారు. విజయ్‌ మాల్యాను మించిపోయే అతిపెద్ద కుంభకోణం చోటుచేసుకోబోతుందని అథారిటీలను హెచ్చరించారు. '' విజయ్‌ మాల్యా, సహారా గ్రూప్‌ సుబ్రతా రాయ్‌, సత్యం గ్రూప్‌ రామలింగరాజులకు మాదిరిగా ముంబైకు చెందిన ఓ వ్యక్తి లేదా కంపెనీ వేలకోట్ల రూపాయల ప్రజల నగదును దోచుకుంటోంది. వెయ్యి కోట్ల మేర ప్రజల దనం దుర్వినియోగం పాలవుతోంది. ఈ మోసదారుడు ఎవరో కాదు గీతాంజలి జెమ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చైర్మన్‌ మెహల్‌ చౌక్సి. గీతాంజలి జెమ్స్‌ లిమిటెడ్‌, మెహల్‌ చౌక్సి, ఇతర సబ్సిడరీలు, స్కాంకు పాల్పడే కంపెనీల వివరాలన్నింటిన్నీ పీడీఎఫ్‌లో ఎన్‌క్లోజ్‌ చేసి ఆర్‌ఓసీ మహారాష్ట్రకు లేఖ పంపించా. కానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే లేఖను పీఎంఓకు కూడా పంపించా. కానీ వారు నా లేఖను పరిగణలోకి తీసుకోలేదు. రెండు లేదా మూడు నెలల అనంతరం నా కేసును మూసివేస్తున్నట్టు ఆర్‌ఓసీ మహారాష్ట్ర నుంచి లేఖ వచ్చింది. విజయ్‌మాల్యా లాగా వీరు దేశం విడిచి పారిపోకుండా చూడాలంటూ అభ్యర్థించా. కానీ ఎలాంటి ప్రయోజనం కలుగలేదు'' అని ప్రసాద్‌ చెప్పారు. జరుగబోయే స్కాం గురించి ముందస్తుగా అధికారులను హెచ్చరించినప్పటికీ, వారు ఇలా నిర్లక్ష్యపూర్వకంగా స్పందించడంతో, వ్యవస్థపై తనకున్న నమ్మకం పోయిందన్నారు ప్రసాద్‌. 

అయితే ప్రసాద్‌, చోక్సికి వ్యతిరేకంగా ఎలాంటి ఫైట్‌ చేయలేదు. ఈ కుంభకోణం గురించి తనకు లీక్‌ కావడంతో, ముందస్తుగానే పీఎంఓకు అలర్ట్‌ ఇచ్చారు. కానీ వారు పట్టించుకోలేదు. ప్రసాద్‌కు ఇవ్వాల్సిన రూ.13 కోట్లను ఇవ్వకుండా.. ఆయన్ను చోక్సి మోసం చేశారు. బెంగళూరులోని గీతాంజలి జెమ్స్‌ ఫ్రాంచైజీని ప్రసాద్‌ నిర్వహిస్తున్నారు. చెల్లిస్తానన్న ఏ నగదును చోక్సి తనకు ఇవ్వలేదని ప్రసాద్‌ ఆరోపించారు. స్టోర్ ప్రాంతాల అద్దె ఇలాంటివేమీ తనకు ఇవ్వకుండా ఎగొట్టారన్నారు. ఈ విషయంపై ప్రసాద్‌ బెంగళూరులోని సెంట్రల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా దాఖలు చేశారు. ఏడాది అనంతరం ప్రసాద్‌ చెప్పినట్టు బ్యాంకింగ్‌ రంగంలోనే అతిపెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితమే అధికారులు స్పందించి ఉంటే, ఈ స్కాం ఇంతదూరం వచ్చేది కాదని ప్రజలు, విపక్షాలు మండిపడుతున్నాయి.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top