
న్యూఢిల్లీ: అంతర్జాతీయ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌కు వాటాలు విక్రయించబోతున్న దేశీ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా మైనారిటీ షేర్ హోల్డర్ల నుంచి 18 లక్షల పైచిలుకు షేర్లను బైబ్యాక్ చేసింది. వీటి విలువ 350 మిలియన్ డాలర్ల పైగా ఉంటుంది. సింగపూర్‌కి చెందిన అకౌంటింగ్, కార్పొరేట్ నియంత్రణ సంస్థకి ఫ్లిప్‌కార్ట్ ఈ మేరకు వివరాలు సమర్పించింది.
పేపర్‌డాట్‌వీసీ అనే డేటా ప్లాట్‌ఫాం సంస్థ సేకరించిన పత్రాల ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ 18.95 లక్షల రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు, 1.74 లక్షల నాన్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లను కొనుగోలు చేసింది. ఈ లావాదేవీలు ఏప్రిల్ 27న పూర్తయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌లో వాటాలు కొనేటప్పుడు అసంఖ్యాక వాటాదారులతో లావాదేవీలు జరపనక్కర్లేకుండా.. తక్కువ మంది ఇన్వెస్టర్లతోనే డీల్ చేసేందుకు వాల్‌మార్ట్‌కి ఈ బైబ్యాక్ ఉపయోగపడగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. 20 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాలకొనుగోలుకు వాల్‌మార్ట్ 12 బిలియన్ డాలర్లు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.