విస్తారా విమానాల్లో డేటా సర్వీసులు | Sakshi
Sakshi News home page

విస్తారా విమానాల్లో డేటా సర్వీసులు

Published Sat, Dec 28 2019 6:12 AM

Vistara partners with Nelco for inflight data services - Sakshi

న్యూఢిల్లీ: విస్తార ఎయిర్‌లైన్స్‌ కంపెనీ త్వరలోనే తన విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్నది. భారత్‌లో విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్న తొలి విమానయాన సంస్థ విస్తార కానున్నది. విమానాల్లో డేటా సర్వీసులను అందించడం కోసం విస్తార కంపెనీ టాటా గ్రూప్‌నకు చెందిన నెల్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కోసం ఈ సంస్థలు ఇస్రో నుంచి ఒక ట్రాన్స్‌పాండర్‌ను తీసుకున్నాయని, దీనికి అవసరమైన స్పెక్ట్రమ్‌ను కేటాయించాలని తమను కోరాయని  టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ తెలిపారు. ఈ సంస్థలు కోరిన స్పెక్ట్రమ్‌ను కేటాయించామని, వీలైనంత త్వరలోనే విస్తార విమానయాన సంస్థ, తన విమానాల్లో డేటా సర్వీసులను అందించనున్నదని ఆయన వివరించారు.  

డేటా సర్వీసులే ముందు...
వాయిస్‌ కాల్స్‌ కంటే ముందు డేటా సేవలు అందుబాటులోకి వస్తాయని, దీంతో ఓవర్‌–ద–టాప్‌(ఓటీసీ) సేవలు పొందవచ్చని, వాట్సాప్‌ కాల్స్‌ చేసుకోవచ్చని ప్రకాశ్‌ పేర్కొన్నారు. వీటి టారిఫ్‌ల నియంత్రణ ప్రభుత్వ పరిధిలో ఉండదని తెలిపారు. ఈ సేవలను ఉచితంగా అందించాలో, లేదా డబ్బులు వసూలు చేయాలో ఆ యా సంస్థలే నిర్ణయిస్తాయని వివరించారు. కాగా విమానాల్లో డేటా సర్వీసులను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెచ్చేది ఇంకా ఖరారు చేయలేదని విస్తార ప్రతినిధి పేర్కొన్నారు.   2015లో కార్యకలాపాలు ప్రారంభించిన విస్తార ప్రస్తుతం 39 విమానాలతో రోజుకు 200 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో టాటా సన్స్‌కు 51% వాటా, మిగిలింది సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు ఉంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement