ఇరాన్‌ చమురుకు చెల్లు!

US decision to end Iran oil waiver to affect India's exports: TPCI - Sakshi

ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా నుంచి కొనుగోళ్లు

మినహాయింపులు పొడిగింపుపై కేంద్రం సంప్రదింపులు

న్యూఢిల్లీ: ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను మన దేశం నిలిపివేయనుంది. ఇరాన్‌పై గతేడాది ఆంక్షలు విధించిన అమెరికా భారత్, చైనా సహా కొన్ని దేశాలకు మాత్రం దిగుమతులకు మినహాయింపు కల్పించింది. అయితే, త్వరలోనే ఈ మినహాయింపులను రద్దు చేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో మన దేశం ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నట్టు, ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి, పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘‘ఇరాన్‌ నుంచి చమురు దిగుమతిని నిలిపివేయనున్నాం. మినహాయింపులను తిరిగి పునరుద్ధరించనంత వరకు ఇరాన్‌ నుంచి భారత్‌ చమురు దిగుమతి చేసుకుంటుందని నేను భావించడం లేదు’’ అని ఆ సీనియర్‌ అధికారి తెలిపారు. అయితే, మే 2తో మినహాయింపులు ముగిసిపోనుండడంతో, వీటిని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం అమెరికా సర్కారును కోరనుందని, ఈ నెలాఖరులో దీనిపై చర్చలు జరగనున్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు. అయితే, అంచనాల ఆధా రంగా కొనుగోళ్లు చేయలేమని, కనుక ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి ఆ లోపు ఉండదన్నారు. ఇరాన్‌ నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా తర్వాత రెండో అతిపెద్ద దేశం భారత్‌. 2018– 19లో 24 మిలియన్‌ టన్నుల క్రూడ్‌ను దిగుమతి చేసుకుంది. ఇరాన్‌ దిగుమతులకు ప్రత్యామ్నా యంగా సౌదీ అరేబియా, కువైట్, యూఏఈ, మెక్సి కోల నుంచి సరఫరాకు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి అమెరికా నిర్ణయంతో ఏర్పడింది.

సరఫరాకు తగిన ప్రణాళిక
భారత రిఫైనరీలకు తగినంత చమురు సరఫరాకు వీలుగా ప్రణాళిక ఉందంటూ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ఇతర చమురు ఉత్పత్తి దేశాల నుంచి అదనపు సరఫరా చేసుకోనున్నాం. దేశీయంగా పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా చేసేందుకు రిఫైనరీలు సిద్ధంగా ఉన్నాయి’’ అని ధర్మేంద్ర ప్రదాన్‌ స్పష్టం చేశారు. మినహాయింపులు ముగిసిన తర్వాత చమురు సరఫరాకు ప్రణాళిక సిద్ధంగా ఉందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సైతం ప్రకటన విడుదల చేసింది. ఏదైనా కొరత ఏర్పడితే ప్రత్యామ్నాయ వనరుల ద్వారా సమకూర్చుకోనున్నట్టు ఐవోసీ చైర్మన్‌ సంజీవ్‌సింగ్‌ సైతం తెలిపారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top