హార్లీ డేవిడ్‌సన్‌ బాయ్‌కాట్‌, ట్రంప్‌ మద్దతు

Trump Encourages Boycott Against Harley Davidson - Sakshi

అమెరికాకు, యూరోపియన్‌ యూనియన్‌కు మధ్య నెలకొన్న టారిఫ్‌ వార్‌ దెబ్బ, అమెరికా అతిపెద్ద మోటార్‌సైకిల్‌ తయారీదారి హార్లీ డేవిడ్‌ సన్‌కు తగిలిన సంగతి తెలిసిందే. టారిఫ్‌ వార్‌ నుంచి బయటపడేందుకు హార్లీ డేవిడ్‌సన్‌.. తన బైకుల ఉత్పత్తిని అమెరికా వెలుపల చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ హార్లీ డేవిడ్‌సన్‌ కనుక అమెరికా వెలుపల ఉత్పత్తిని చేపడితే, వినియోగదారులు ఈ బైకులను బాయ్‌కాట్‌ చేయనున్నారు. వినియోగదారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వాగతిస్తున్నారు. అంతేకాక వినియోగదారులను పొగుడుతూ... గ్రేట్‌ అని ప్రశంసలు కురిపించారు. దీనిపై ట్రంప్‌ ఒక ట్వీట్‌ కూడా చేశారు. ‘ఒకవేళ అమెరికా వెలుపల హార్లీ డేవిడ్‌సన్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తే చాలా మంది హార్లీ డేవిడ్‌సన్‌ యజమానాలు కంపెనీని బాయ్‌కాట్‌ చేయాలనుకుంటున్నారు. గ్రేట్‌! చాలా కంపెనీలు ముఖ్యంగా హార్లీ ప్రత్యర్థులు మా బాటలో నడుస్తున్నాయి. కానీ ఇది చాలా చెత్త తరలింపు’ అని ట్రంప్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్రంప్‌ చేసిన ఈ ట్వీట్‌పై హార్లీ డేవిడ్‌సన్‌ ఇంకా స్పందించలేదు. 

ట్రంప్‌ కార్యాలయానికి, హార్లీ డేవిడ్‌సన్‌ కంపెనీకి గత కొన్ని రోజులుగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు విదేశాల నుంచి వచ్చే స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్‌ భారీ మొత్తంలో టారిఫ్‌లు విధించారు. ట్రంప్‌ ఆ నిర్ణయానికి కౌంటర్‌గా యూరోపియన్‌ యూనియన్‌ కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువుపై పన్నులు విధించింది. వాటిలో హార్లీ మోటార్‌సైకిల్స్‌ కూడా ఉన్నాయి. దీంతో హార్లీ డేవిడ్‌సన్‌ ఏడాదికి 100 మిలియన్‌ డాలర్లను కోల్పోవాల్సి వస్తుంది. భారీగా ఆదాయం కోల్పోతుండటంతో, కంపెనీకి చెందిన కొంత ఉత్పత్తిని అమెరికా వెలుపల చేపట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది. కంపెనీ కొన్ని ఆపరేషన్లను థాయ్‌లాండ్‌ తరలించాలని చూస్తున్నట్టు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే కొంత ఉత్పత్తిని తరలించినట్టు హార్లీ డేవిడ్‌సన్‌ చెప్పింది. అమెరికాలోకి వచ్చే ఇతర మోటార్‌ సైకిల్‌ కంపెనీలతో కలిసి తాము పనిచేస్తామని ట్రంప్‌ గత నెలలోనే చెప్పారు. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top