ప్రారంభమైన ట్రెడా ప్రాపర్టీ షో

Trenda property show that started - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (ట్రెడా) 9వ ప్రాపర్టీ షో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న చీఫ్‌ సెక్రటరీ ఎస్‌కే జోషి మాట్లాడుతూ.. తెలంగాణలో 2008–14 మధ్య కాలంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొందని.. కానీ, గత నాలుగేళ్లుగా ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు, రాయితీలు, ప్రోత్సాహకాలతో రియల్టీ రంగానికి మళ్లీ మంచి రోజులొచ్చాయని గుర్తు చేశారు.

నగరానికి ఐటీ, ఇతర రంగాల్లో అంతర్జాతీయ కంపెనీలు రావటం, ఉన్న కంపెనీలు విస్తరణ కార్యకలాపాలు చేపట్టడంతో ఆఫీసు స్పేస్‌కే కాకుండా గృహాలకు కూడా డిమాండ్‌ పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ బీఈ పాపారావు, ట్రెడా ప్రెసిడెంట్‌ పీ రవీందర్‌ రావు, ట్రెజరర్‌ శ్రీధర్‌ రెడ్డి కే, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ సాయి ఎం, సెక్రటరీ జనరల్‌ సునీల్‌ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు, రేపు కూడా..
మాదాపూర్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో జరుగుతున్న ఈ ప్రాపర్టీ షో శని, ఆదివారాల్లోనూ అందుబాటులో ఉంటుంది. ప్రవేశం ఉచితం. ఇందులో నగరానికి చెందిన వందకు పైగా నిర్మాణ సంస్థలు 145 స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రాజెక్ట్‌లను, వెంచర్లను ప్రదర్శించాయి. ఈ షోలో 11 బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు, 15 నిర్మాణ సామగ్రి, ఇంటరీయర్‌ కంపెనీలు ఆయా ఉత్పత్తుల, ఆఫర్లను ప్రదర్శించాయి. ట్రెడా 9వ ప్రాపర్టీ షోకు వాసవి గ్రూప్, అపర్ణా, మై హోమ్, గ్రీన్‌ రిచ్‌ ఎస్టేట్స్, హోల్‌మార్క్‌ బిల్డర్స్, సైబర్‌ సిటీ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్, రాంకీ ఎస్టేట్స్‌ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి.

రెయిన్‌బో విస్టాస్‌కు ఐజీబీసీ అవార్డు
సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌సిటీ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ నిర్మిస్తున్న రెయిన్‌బో విస్టాస్‌ రాక్‌ గార్డెన్‌ ప్రాజెక్ట్‌ను ఐజీబీసీ గ్రీన్‌ హోమ్స్‌ అవార్డు వరించింది. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ఐజీబీసీ గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌–2018లో ఈ అవార్డును కంపెనీ ఎండీ వేణు వినోద్‌ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐజీబీసీ హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ సీ శేఖర్‌ రెడ్డి, వరల్డ్‌ జీబీసీ మాజీ చైర్మన్‌ టై లీ, ఏపీ–రెరా చైర్మన్‌ రామనాథన్, టీ–రెరా చైర్మన్‌ రాజేశ్వర్‌ తివారీ పాల్గొన్నారు. రెయిన్‌బో విస్టాస్‌ మూసాపేట్‌లో 45 లక్షల చ.అ.ల్లో 2,500 గృహాలతో ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top