
రాష్ట్రంలో చాలా కొద్దిమంది భావిస్తున్నట్లు రియల్టీ బూమ్ తగ్గిపోయిందనే వాదనల్లో ఏమాత్రం నిజం లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో రియల్టీ రంగం కీలకం ఉందని రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ‘నారెడ్కో తెలంగాణ 15వ ప్రాపర్టీ షో’ను ప్రారంభించిన ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ ప్రాపర్టీ షోను ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ..‘రాష్ట్రం రియల్టీ రంగంలో దూసుకుపోతుంది. చాలా కొద్దిమంది భావిస్తున్నట్లు రాష్ట్రంలో రియల్టీ బూమ్ తగ్గిపోయిందనే వాదనల్లో ఏమాత్రం నిజం లేదు. సామాన్యులు నగరంలో ఉన్న చాలా ప్రాపర్టీ వెంచర్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరించడం కొంత వ్యయప్రయాసలతో కూడుకుంది. ఏటా నారెడ్కో ఆధ్వర్యంలోని ఇలాంటి ప్రాపర్టీ షోల వల్ల వందల కంపెనీలు ఒకే గొడుగు కిందకు వస్తున్నాయి. దాంతో గృహ కొనుగోలుదారులు మెరుగైన ప్రాపర్టీని ఎంచుకోవడం సులువవుతుంది. నారెడ్కో హైదరాబాద్ అభివృద్ధి గురించి దేశవ్యాప్తంగా తెలియజేసేందుకు ఇదో అవకాశం. ప్రభుత్వం నగరంలోని మౌలిక సదుపాయాల వృద్ధికి ఎంతో కృషిచేస్తోంది. రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుతో సిటీ మరింత విస్తరించేందుకు అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ బస్సుల ఏర్పాటు, ట్యాక్స్ రాయితీలివ్వడం, సివేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ఎస్‌టీపీ)లను ఏర్పాటు చేస్తోంది. త్రాగునీరు కల్పన, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. హైడ్రా వంటి చట్టాలు వచ్చిన మొదట్లో స్థానికంగా కొంత వ్యతిరేకత వచ్చినా నెమ్మదిగా ప్రజలు దాని ప్రాముఖ్యతను గుర్తిస్తున్నారు. నారెడ్కో, రియల్టీ సంస్థలు కూడా స్పందించి కమర్షియల్ కోణంతోపాటు సామాజిక బాధ్యత కింద సీఎస్‌ఆర్ నిధులను వివిధ కార్యక్రమాలకు వెచ్చించాలి’ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నారెడ్కో తెలంగాణ అధ్యక్షుడు విజయసాయి మేక మాట్లాడుతూ..‘ప్రీమియం, లగ్జరీ ప్రాపర్టీ విభాగాల్లో బలమైన డిమాండ్ ఉంది. ఇది వృద్ధికి దోహదపడుతోంది. కొనుగోలుదారులు ప్రధాన ప్రదేశాల్లో తమ జీవనశైలి ఆధారిత గృహాల కోసం ఎక్కువగా చూస్తున్నారు. పెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు, వేతవంతమైన పట్టణీకరణతో హైదరాబాద్ నివాస మార్కెట్ జాతీయంగా మెరుగైన పెట్టుబడి గమ్యస్థానాల్లో ఒకటిగా అభివృద్ధి చెందుతోంది’ అన్నారు. ఈ సందర్భంగా రెరా వంటి పకడ్బందీ రెగ్యులేటర్లు ఉండగా ప్రభుత్వం డెవలపర్ల నుంచి 10 శాతం మార్టగేజ్ ట్యాక్స్‌ను వసూలు చేస్తోందని గుర్తుచేస్తూ దీన్ని వెంటనే తొలగించాలని కోరారు. దీనిపై బట్టి విక్రమార్క స్పందిస్తూ..‘ప్రభుత్వం అందరి అభివృద్ధికి తోడ్పడుతుంది. బిల్డర్లు, రియల్టీ డెవలపర్లు సంబంధిత ప్రతిపాదనలతో వస్తే తప్పకుండా దీనిపై సమాలోచనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న నారెడ్కో తెలంగాణ సెక్రటరీ జనరల్ కె.శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో టెక్నాలజీ కంపెనీలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇది ప్రపంచ వ్యాపార సంస్థలకు కేంద్రంగా హైదరాబాద్ వ్యూహాత్మక ప్రాంతాన్ని ప్రముఖంగా నిలుపుతున్నాయి. నగరంలో మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులు, అనుకూలమైన దీర్ఘకాలిక రియల్ ఎస్టేట్ వాతావరణం ఉంది. దాంతో నగరాన్ని నివాస, వాణిజ్య పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మార్చుకోవాలని భావిస్తున్నారు’ అని అన్నారు.
ఇదీ చదవండి: మార్పు మంచిదే! ఎవరిపై ఎంత ప్రభావం?