నిరోధం 28,290-మద్దతు 27,900 | Sakshi
Sakshi News home page

నిరోధం 28,290-మద్దతు 27,900

Published Mon, Aug 22 2016 12:46 AM

The resistance-support 27,900 28,290

మార్కెట్ పంచాంగం

అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాదే వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు మళ్లీ ఊపందుకోవడంతో ప్రపంచ మార్కెట్లన్నీ గతవారం స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. భారత్ మార్కెట్ కూడా అదేరీతిలో కదిలినప్పటికీ, సీఎన్‌ఎక్స్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఏడాదిన్నర గరిష్టస్థాయికి చేరగలిగింది. ఐటీ షేర్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ వంటి ఇండెక్స్ హెవీవెయిట్స్ నిస్తేజంగా ట్రేడ్‌కావడంతో బ్యాంక్ ఇండెక్స్ తరహాలో ప్రధాన సూచీలు పెరగలేకపోయాయి. అయితే గతవారం బ్యాంక్ ఇండెక్స్ సాధించిన బ్రేక్ అవుట్‌ను నిలబెట్టుకోగలిగితే, కొద్దిరోజుల్లో ప్రధాన సూచీలు కూడా పరుగులు తీసే అవకాశాలుంటాయి. సాంకేతికాంశాలకొస్తే...

 
సెన్సెక్స్ సాంకేతికాలు...

ఆగస్టు 19తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ కేవలం 250 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనై చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 75 పాయింట్ల స్వల్పనష్టంతో 28,077 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. కొత్త ఆర్‌బీఐ గవర్నర్ నియామక ప్రభావం మార్కెట్‌పై వుంటే గతవారపు టైట్ రేంజ్ నుంచి సెన్సెక్స్ బ్రేక్ అవుతుంది. అలా బ్రేక్‌అవుట్ అయితే 28,290 పాయింట్ల నిరోధ స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ కీలక అవరోధ స్థాయి అయిన 28,580 పాయింట్ల స్థాయిని కూడా చేరే అవకాశం  వుంది. ఈ స్థాయిని కూడా దాటితే 29,000 శిఖరాన్ని చేరడం సెన్సెక్స్‌కు కష్టంకాదు. లేదా బ్రేక్‌డౌన్ జరిగితే 27,900 పాయింట్ల స్థాయి తక్షణ మద్దతు అందించవచ్చు. ఆ లోపునకు పడిపోతే 27,740-27,600 పాయింట్ల శ్రేణి మధ్య పలు మద్దతులు లభిస్తున్నాయి.ఈ శ్రేణిని కోల్పోతే మాత్రం మార్కెట్ క్రమేపీ డౌన్‌ట్రెండ్‌లోకి మళ్లవచ్చు. 

 
నిఫ్టీ మద్దతు 8,600-నిరోధం 8,728
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ క్రితం వారం 8,696-8.600 పాయింట్ల శ్రేణి మధ్య కదలాడి, చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 5పాయింట్ల స్వల్పనష్టంతో 8,667 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో మొదలైతే 8,728 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు.  ఆపైన స్థిరపడితే క్రమేపీ 8,845 పాయింట్ల వద్దకు చేరే ఛాన్స్ వుంటుంది. ఈ కీలకస్థాయిని రానున్న రోజుల్లో అధిగమిస్తే ఆల్‌టైమ్ రికార్డుస్థాయిని అందుకునే అవకాశాలుంటాయి.  ఈ వారం మార్కెట్ క్షీణతతో మొదలైతే గత కొద్దిరోజుల నుంచి మూడు దఫాలు మద్దతును అందించిన 8,600 స్థాయి మరోసారి మద్దతునివ్వవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 8,560-8,520 పాయింట్ల శ్రేణి మధ్యలో పలు మద్దతులు అందుబాటులో వున్నాయి. ఈ శ్రేణిని కూడా వదులుకుంటే 8,400 స్థాయికి పడిపోవొచ్చు. ఆగస్టు డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా 8,800 స్ట్రయిక్ వద్ద అధికస్థాయి కాల్ బిల్డప్ (74 లక్షలు), 8,500 స్ట్రయిక్ వద్ద గరిష్టస్థాయిలో పుట్ బిల్డప్ జరిగింది. రానున్న రోజుల్లో మార్కెట్ పెరిగితే 8,800 స్థాయి గట్టిగా నిరోధించవచ్చని, తగ్గితే..8,500 స్థాయి పటిష్టమైన మద్దతును అందించవచ్చని ఈ బిల్డప్ సూచిస్తున్నది.   - పి. సత్యప్రసాద్

 

Advertisement
Advertisement