జియో.. మా అమ్మాయి ఆలోచనే

Telecom venture Jio was seeded by Isha says father Mukesh Ambani - Sakshi

4జీ లీడర్‌గా ఎదగనున్న భారత్‌

పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ వెల్లడి

రిలయన్స్‌కు ప్రతిష్టాత్మక ‘డ్రైవర్స్‌ ఫర్‌ చేంజ్‌’ పురస్కారం

లండన్‌: దేశ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో ఆవిర్భావానికి తన కుమార్తె ఈషానే కారణమని వెల్లడించారు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ. ‘మా అమ్మాయి ఈషా 2011లో యేల్‌ విశ్వవిద్యాలయంలో (అమెరికా) విద్యార్థినిగా ఉన్నప్పుడు.. ఒకసారి సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చింది. అప్పుడు ఏదో కోర్స్‌ వర్క్‌ ఆన్‌లైన్లో పంపాల్సి వచ్చింది. కానీ ఇంటర్నెట్‌ వేగం తనకు విసుగు తెప్పించింది. నాన్నా.. మన దగ్గర ఇంటర్నెట్‌ వేగం చాలా దారుణంగా ఉంది అంటూ ఆ విషయాన్ని నాతో పంచుకుంది.

ఈలోగా.. ఆకాశ్‌ (ఈషా కవల సోదరుడు) గతంలో టెలికం అంటే కేవలం వాయిస్‌ కాల్స్‌కి మాత్రమే పరిమితమని... ప్రస్తుతం కొత్త ప్రపంచం అంతా డిజిటల్‌మయమేనని చెప్పుకొచ్చాడు. ఈ సంభాషణే జియో ఆవిర్భావానికి బీజం వేసింది’ అని అంబానీ వివరించారు. ప్రతిష్టాత్మక ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఆర్సెలర్‌ మిట్టల్‌ బోల్డ్‌నెస్‌ ఇన్‌ బిజినెస్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో ’మార్పు చోదకులు’  పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా  ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

హైడ్రోకార్బన్స్‌ అన్వేషణ, ఉత్పత్తి.. పెట్రోలియం రిఫైనింగ్‌..మార్కెటింగ్, పెట్రోకెమికల్స్, రిటైల్, 4జీ డిజిటల్‌ సర్వీసుల విభాగంలో అత్యుత్తమ పనితీరునకు గాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి ఈ పురస్కారం దక్కింది. ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో నిలవాలనే ఆకాంక్ష గల భారత నవతరానికి ఈషా, ఆకాశ్‌లాంటి వారు ప్రతినిధులని ముకేశ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ కీలకమని, ఈ విషయంలో భారత్‌ వెనుకబడి పోకూడదంటూ వారే తనను ఒప్పించారని ఆయన తెలిపారు.

మూడేళ్లలోనే భారీ నెట్‌వర్క్‌..
మొత్తం భారత టెలికం రంగం దేశవ్యాప్తంగా 2జీ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయడానికి పాతికేళ్లు తీసుకోగా.. తాము కేవలం మూడేళ్లలో అత్యాధునిక 4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను నిర్మించామని.. ఇది ప్రస్తుతం 5జీ టెక్నాలజీకి కూడా ఉపయోగపడనుందని ముకేశ్‌ అంబానీ చెప్పారు.

అమెరికాలో రేటుతో పోలిస్తే పదో వంతుకే ఇక్కడ ఇంటర్నెట్‌ అందిస్తున్నామన్నారు. ‘‘గతంలో డేటా వేగం చాలా తక్కువగా ఉండటంతో పాటు రేట్లు భారీగా ఉండటం వల్ల మెజార్టీ జనాభాకు ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండేది కాదు. కానీ జియో రాకతో ఇదంతా మారిపోయింది. దేశమంతటా ఇపుడు ఇంటర్నెట్‌ లభ్యత పుష్కలంగా ఉంది. పైగా అత్యంత చౌక రేటుకే లభిస్తోంది’’ అని వివరించారు. కార్యకలాపాలు ప్రారంభించిన 170 రోజుల్లోనే తాము 10 కోట్ల మంది కస్టమర్లను సాధించామన్నారు.

ఈ నేపథ్యంలో 1జీ నుంచి 3జీ దాకా అమెరికా, యూరప్, చైనా ఆధిపత్యం కనబరిచినప్పటికీ.. 4జీ విషయంలో మాత్రం తమ భారీ నెట్‌వర్క్‌ ఊతంతో 2019లో భారత్‌ లీడర్‌గా నిలుస్తుందని అంబానీ చెప్పారు. 2016లో కార్యకలాపాలు ప్రారంభించిన జియో.. చౌక ఇంటర్నెట్‌తో పాటు ఉచిత కాల్స్‌ అందిస్తూ ప్రస్తుతం దేశీయంగా నాలుగో అతి పెద్ద టెలికం కంపెనీగా మారింది.

రోజూ 5 లక్షల మంది జియోకి మారుతున్నారు..
ప్రపంచంలోనే అత్యంత చౌకైన 4జీ ఎల్‌టీఈ స్మార్ట్‌ఫోన్‌ని తాము ప్రవేశపెట్టామని.. దీనితో రోజుకు 3 లక్షల నుంచి 5 లక్షల మంది జియో ఫోన్‌కి మారుతున్నారని అంబానీ చెప్పారు. వచ్చే కొన్నేళ్లలో మొత్తం యూరప్‌ జనాభాలో మూడింట రెండొంతుల మందికి సమానమైన భారత జనాభాకి ప్రపంచ స్థాయి డిజిటల్‌ సర్వీసులు అందుబాటులోకి తెస్తామన్నారు.

గతంలో మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ డేటా వినియోగంలో ప్రపంచంలో 155వ ర్యాంకులో ఉన్న భారత్‌.. కేవలం రెండేళ్ల వ్యవధిలో నంబర్‌ వన్‌ స్థాయికి ఎదిగిందని చెప్పారు. భారత చరిత్రలోనే అత్యంత భారీ స్టార్టప్‌గా జియో ఎదిగిందన్నారు. ప్రతిష్టాత్మక డ్రైవర్స్‌ ఆఫ్‌ చేంజ్‌ అవార్డు అందుకున్న దిగ్గజ సంస్థల్లో .. ఆలీబాబా, హెచ్‌బీవో, అమెజాన్, యాపిల్, ఫియట్, ర్యాన్‌ ఎయిర్‌ తదితర సంస్థలున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top