పీఎన్‌బీ స్కాం: సిట్‌ ఏర్పాటు చేయండి!

Supreme Court to hear plea against Nirav Modi - Sakshi

సాక్షి న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసుపై  ప్రత్యేక దర్యాప్తుబృందంతో  విచారణ జరిపించాలని రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయవాదులు వినీత్‌ దండా, ఎంఎల్ శర్మ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు మంగళవారం ఆమోదం తెలిపింది.  బ్యాంకులకు రుణాలు చెల్లించలేని రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటారనీ, ప్రజల హక్కులను కాపాడేందుకు ఈ కేసులో సుప్రీం జోక్యం చేసుకోవాలని పిల్‌లో కోరారు.  చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా , న్యాయమూర్తులు ఎ.ఎ. ఖాన్విల్కర్, డి.ఎ. చంద్రచూడ్‌ ఆధ్వర్యంలోని బెంచ్  ఫిబ్రవరి 23 శుక్రవారం విచారణను ప్రారంభించనుంది.   
 
పీఎన్‌బీ మెగాస్కాంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ జరిపించాలని  పిటీషనర్ వినీత్‌ దండా డిమాండ్‌ చేశారు.   ప్రధాన  ఆరోపణలుఎదుర్కొంటున్న నీరవ్ మోదీని  రెండునెలలోగా స్వదేశానికి తిరిగి తీసుకురావాలని కోరారు. రెండు నెలలలోగా పీఎన్‌బీ స్కామ్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని దండా కోరారు. ఇవే డిమాండ్లతో న్యాయవాది ఎంఎల్ శర్మ  మరో పిటిషన్‌ దాఖలు చేశారు. సిట్‌ లో సుప్రీంకోర్టు  రిటైర్డ్ న్యాయమూర్తులు ఉండాలని కోరారు. రాజకీయ నాయకులు /అధికారుల నియంత్రణలో లేని సంస్థతో  విచారణ జరగాన్నారు. అంతేకాదు రూ. 10కోట్లకు మించిన రుణాల కేటాయింపులో ఆర్థికమంత్రిత్వశాఖ ప్రత్యేక మార్గనిర్దేశకాలు  జారీచేసేలా కోర్టు జోక్యం చేసుకోవాలన్నారు.  దోషులపై కఠినచర్యలు తీసుకోవాని, ఇలాంటి స్కాముల పాల్పడిన వారికి విధించే 3 సంవత్సరాల జైలు శిక్షకు బదులు జీవిత ఖైదు విధించేలా మార్పులు తేవాలని డిమాండ్‌ చేశారు. దేశంలో  మొండి బకాయిల వివరాలను సేకరించేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా పిటీషనర్లు విజ్ఞప్తి చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top