రికార్డ్‌ల ర్యాలీకి బ్రేక్‌ 

Stock market update: PSU bank stocks rise; SBI, PNB climb nearly 2% - Sakshi

చివరి గంటలో భారీగా అమ్మకాలు 

ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైకి సెన్సెక్స్‌ 

174 పాయింట్లు పతనమై 38,723 వద్ద ముగింపు

47 పాయింట్ల నష్టంతో  11,692కు నిఫ్టీ  

వరుస రెండు రోజుల రికార్డ్‌ల ర్యాలీకి బుధవారం బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకినప్పటికీ, చివరి గంటలో భారీగా అమ్మకాలు జరగడంతో చివరకు నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ 11,700 పాయింట్ల దిగువకు క్షీణించింది. డాలర్‌తో రూపాయి మారకం జీవిత కాల కనిష్ట స్థాయికి పడిపోవడం, ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో ద్రవ్యలోటు ఒత్తిడులు తప్పవంటూ మూడీస్‌ సంస్థ హెచ్చరించడం... ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 174 పాయింట్లు నష్టపోయి 38,723 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 47 పాయింట్లు నష్టంతో 11,692 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,990 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. లోహ, రియల్టీ, పీఎస్‌యూ, ఆయిల్, గ్యాస్, మౌలిక, వాహన రంగ షేర్లు పెరిగాయి.  

లాభాల స్వీకరణ... 
ఈ నెల డెరివేటివ్‌ కాంట్రాక్టులు గురువారంతో ముగియనుండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని, రూపాయి పతనం కూడా తోడవడంతో మార్కెట్‌ నష్టపోయిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌  93 పాయింట్ల లాభంతో 38,990 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ కారణంగా 217 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 310 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 15 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 60 పాయింట్ల వరకూ నష్టపోయింది.  

ఏడు రోజుల తర్వాత రిలయన్స్‌కు నష్టాలు... 
వరుసగా ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో లాభపడుతూ వచ్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ నష్టపోయింది. 1.8 శాతం క్షీణించి రూ.1,294 వద్ద ముగిసింది. కోల్‌ ఇండియా 2.5 శాతం పతనమై రూ.287 వద్దకు చేరింది. ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయ వార్తల కారణంగా ఎస్‌బీఐ షేర్‌ 1.5 శాతం లాభంతో రూ.310 వద్ద ముగిసింది. ఇక లాభాల స్వీకరణ కారణంగా ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యస్‌ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు నష్టపోయాయి.

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 9 శాతం అప్‌... 
నిఫ్టీ 50 సూచీలో వచ్చే నెల 28 నుంచి జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను చేరుస్తున్నారు. దీంతో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ జోరుగా పెరిగింది. ఇంట్రాడేలో 12 శాతం లాభంతో తాజా ఏడాది గరిష్ట స్థాయి, రూ.409ను తాకింది. చివరకు 9 శాతం లాభంతో రూ.398 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ సూచీ నుంచి తొలగిస్తున్న లుపిన్‌ 2% నష్టపోయి రూ. 884 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top