స్టార్టప్ కంపెనీల్లో కొలువుల జాతర | Sakshi
Sakshi News home page

స్టార్టప్ కంపెనీల్లో కొలువుల జాతర

Published Mon, Feb 23 2015 1:25 AM

స్టార్టప్ కంపెనీల్లో కొలువుల జాతర

2020 నాటికి 3 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో స్టార్టప్ కంపెనీలు దాదాపు 3 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. దాదాపు 80 శాతం మంది ఉద్యోగం కోరుకునే వారు  స్టార్టప్ కంపెనీలలో ఉద్యోగం చేయటానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. గతేడాది స్టార్టప్ కంపెనీలు దాదాపు 50 వేల నుంచి 60 వేల మందికి ఉపాధిని కల్పించాయని, వచ్చే ఏడాది కూడా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశ ఉందని మానవ వనరుల నిపుణులు అభిప్రాయపడ్డారు.

2020 సంవత్సరానికల్లా స్టార్టప్ కంపెనీలలో ఉద్యోగ కల్పన 2.5 నుంచి 3 లక్షలుగా ఉంటుందని మెరిట్‌ట్రాక్ సంస్థ పేర్కొంది. భారత స్టార్టప్ కంపెనీలలో ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని, దీనికి తామే సాక్ష్యమని మెరిట్‌ట్రాక్ ఇన్నోవేషన్స్ అండ్ న్యూ ప్రోడక్ట్స్ డెవలప్‌మెంట్ జనరల్ మేనేజర్ రాజీవ్ మీనన్ అన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగ నియామక పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని చెప్పారు. నేర్చుకోవటానికి, స్థిరపడటానికి, వేగంగా ఎదగటానికి కావాల్సిన అపార అవకాశాల కోసం పలువురు  స్టార్టప్ కంపెనీల వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. గత రెండేళ్ల నుంచి స్టార్టప్ కంపెనీలలో ఉద్యోగం కోరుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని హెచ్‌ఆర్ సర్వీస్ సంస్థ రాండ్ట్సాండ్ ఇండియా సీఈఓ మూర్తి కె ఉప్పలూరి అన్నారు.

Advertisement
Advertisement