భారత్కు మరో చౌక ఎయిర్లైన్స్.. | Singapore Airlines' to launch India flights under Scoot brand | Sakshi
Sakshi News home page

భారత్కు మరో చౌక ఎయిర్లైన్స్..

Apr 23 2016 12:54 AM | Updated on Sep 3 2017 10:31 PM

చౌక విమానయాన సేవల రంగంలో మరో సంస్థ భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది.

మే 24న స్కూట్ ఎయిర్‌లైన్స్ ఎంట్రీ
ముందుగా మూడు నగరాలకు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చౌక విమానయాన సేవల రంగంలో మరో సంస్థ భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు చెందిన స్కూట్ ఎయిర్‌లైన్స్ మే నెలలో భారత్‌లో అడుగు పెడుతోంది. మే 24న సింగపూర్ కేంద్రంగా చెన్నైతోపాటు అమృత్‌సర్ నగరాలకు సర్వీసులను ప్రారంభిస్తోంది. సింగపూర్-చెన్నై-సింగపూర్‌కు ప్రతిరోజు, సింగపూర్-అమృత్‌సర్-సింగపూర్‌కు వారంలో మూడు రోజులు విమానాలు నడుస్తాయి. అక్టోబరు 2 నుంచి జైపూర్‌కు విస్తరించనున్నట్టు స్కూట్ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు. సింగపూర్-జైపూర్-సింగపూర్‌కు వారంలో నాలుగు సర్వీసులు నడుపుతారు.

 డ్రీమ్‌లైనర్ల ద్వారా..
స్కూట్ భారత్‌లో 375 సీట్ల వరకు సామర్థ్యం ఉన్న వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలను నడుపనుంది. మరో లో కాస్ట్ విమానయాన సంస్థ  ఎయిర్ ఆసియా మాత్రమే ప్రస్తుతం ఈ విమానాలను భారత్‌కు నడుపుతోంది. 2012లో ప్రారంభమైన స్కూట్ భారత్‌లో ఎంట్రీ ఇవ్వడంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు చెందిన 4వ బ్రాండ్‌గా నిలవనుంది.

 సింగపూర్‌కు 64 డాలర్లు..
భారత్‌లోకి వస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 28 వరకు పరిమిత కాల ఆఫర్‌ను స్కూట్ ప్రకటించింది. భారత్ నుంచి స్కూట్ నెట్‌వర్క్‌లోని అన్ని నగరాలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. చెన్నై, అమృత్‌సర్, జైపూర్ నుంచి సింగపూర్‌కు ఎకానమీ టికెట్ ఒకవైపుకు 64 డాలర్ల నుంచి ప్రారంభం. సిడ్నీకి 189 డాలర్ల నుంచి లభిస్తాయి. టికెట్ల ప్రారంభ ధర బిజినెస్ క్లాస్‌లో సింగపూర్‌కు 179 డాలర్లు, సిడ్నీకి 459 డాలర్లుగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement