35,540 దిగువన డౌన్‌ట్రెండ్‌

Sensex, Nifty off to a weak start amid tepid global cues - Sakshi

మార్కెట్‌ పంచాంగం

మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్‌డీఏ ఓటమిచెందడం, రిజర్వుబ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ రాజీనామా, ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వంటి పలు ప్రతికూలాంశాల నడుమ వరుసగా ఏడురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ మార్కెట్‌...శుక్రవారం అంతర్జాతీయ ట్రెండ్‌కు తలొగ్గింది. అమెరికా మార్కెట్లయితే ఊపిరి పీల్చుకోకుండా పడుతున్నాయి. జపాన్‌లో సైతం ఇదే తంతు. గత శుక్రవారం అమెరికా మార్కెట్లో ట్రేడింగ్‌ పరిమాణం రెట్టింపయ్యింది. అక్కడ ఇదే ట్రెండ్‌ కొనసాగితే ఇండియాతో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లన్నీ తీవ్రమైన బేర్‌కక్ష్యలోకి మళ్లే ప్రమాదం వుంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. డిసెంబర్‌ రెండోవారం నుంచి విదేశీ, స్వదేశీ ఫండ్స్‌ మన మార్కెట్లో తీసుకున్న భారీ లాంగ్‌ పొజిషన్లను జనవరికి రోలోవర్‌ చేస్తారా లేదా వారి పొజిషన్లను పూర్తిగా ఆఫ్‌లోడ్‌ చేస్తారా అనే అంశం ఇక్కడ కీలకం.   

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
డిసెంబర్‌ 21తో ముగిసిన వారంలో గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన 35,800  మద్దతును పరిరక్షించుకుని వేగంగా 36,555 గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ శుక్రవారం భారీ పతనాన్ని చవిచూసి 35,695 కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 221 పాయింట్ల నష్టంతో 35,742 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్‌కు 200 రోజుల చలనసగటు రేఖ (200 డీఎంఏ) కదులుతున్న 35,540 పాయింట్ల స్థాయి కీలకం. ఈ స్థాయి దిగువన సోమవారం గ్యాప్‌డౌన్‌తో మార్కెట్‌ మొదలైతే వేగంగా 35,445 పాయింట్ల స్థాయికి పడిపోవొచ్చు. ఈ లోపున  50 డీఎంఏ రేఖ చలిస్తున్న 35,175 పాయింట్ల వరకూ సెన్సెక్స్‌కు సాంకేతిక మద్దతు ఏదీ లేదు. ఈ లోపున ముగిస్తే 34,420 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 36,050 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 36,200 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. ఆపైన ముగింపు..సెన్సెక్స్‌ను 36,480 పాయింట్ల స్థాయికి చేర్చవచ్చు.  


10,765 దిగువన నిఫ్టీ బలహీనం
గతవారం ప్రథమార్ధంలో 10,985 పాయింట్ల వరకూ పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ద్వితీయార్థంలో 10,738 పాయింట్ల స్థాయికి పతనమయ్యింది. చివరకు అంతక్రితంవారంకంటే 51 పాయింట్ల లాభంతో 10,754 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 200 డీఎంఏ రేఖ 10,765 పాయింట్ల వద్ద కదులుతున్నది. ఈ రేఖ ఎగువకు గత నెలరోజుల్లో రెండోదఫా నిఫ్టీ చేరినప్పటికీ, ఈ రెండు సందర్భాల్లో ఆపైన నిలదొక్కుకోలేకపోయింది. ఈ కీలక స్థాయి దిగువన నిఫ్టీ తిరిగి డౌన్‌ట్రెండ్‌లోకి జారుకునే ప్రమాదం వుంది. ఈ స్థాయి దిగువన సోమవారం నిఫ్టీ మొదలైతే వేగంగా 10,650 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున 50 డీఎంఏ రేఖ సంచరిస్తున్న 10,565 పాయింట్ల వద్దకు పతనం కావచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 10,330 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం నిఫ్టీ 10,765 పాయింట్ల స్థాయి ఎగువన స్థిరపడితే 10,820 వరకూ పెరగవచ్చు. అటుపై 10,880 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. ఆపైన కీలక అవరోధస్థాయి 10,965 పాయింట్లు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top