నాలుగో రోజూ లాభాలే...

Sensex, Nifty extend gains for 4th session - Sakshi

హెచ్చుతగ్గుల్లో సూచీలు 

సెన్సెక్స్‌ 93 పాయింట్లు ప్లస్‌...

స్టాక్‌ మార్కెట్‌ లాభాలు వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ కొనసాగాయి. ఆర్థిక, ఇంధన, ఐటీ రంగ షేర్ల జోరుతో సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం లాభాల్లో ముగిశాయి. అయితే ట్రేడింగ్‌ ఆద్యంతం సెన్సెక్స్, నిఫ్టీలు లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. రోజం తా 249 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 93 పాయింట్ల లాభంతో 38,599 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 11,464 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 17 పైసలు పుంజుకోవడం కలసివచ్చింది.  

249 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌...
ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, విప్రో, ఏసీసీ తదితర కంపెనీల క్యూ2 ఫలితాలు పటిష్టంగా ఉండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. ప్రపంచ మార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నా, మన మార్కెట్‌ వరుసగా నాలుగో రోజు లాభపడిందని శాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ సునీల్‌ శర్మ తెలిపారు. కంపెనీల ఫలితాల సీజన్‌ అంచనాల కంటే మెరుగ్గానే ఉందని అంతేకాకుండా భవిష్యత్తు అంచనాలపై కంపెనీల యాజమాన్యాలు ఆశావహ ప్రకటనలు చేయడం సానుకూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.   

20,000 కోట్ల డాలర్ల కంపెనీగా రిలయన్స్‌!
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు  20,000 కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ గల తొలి కంపెనీగా అవతరించే సత్తా ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ తెలిపింది. ప్రస్తుతం 12,200 కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ గల ఈ కంపెనీ రెండేళ్లలో ఈ ఘనత సాధించగలదని ఈ సంస్థ అంచనా వేస్తోంది. మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యంతో ఎస్‌ఎమ్‌ఈ ఎంటర్‌ప్రైజ్‌ స్పేస్‌లోకి ప్రవేశించడం, జియో ఫైబర్‌  బిజినెస్‌.. తదితర అంశాలతో రిలయన్స్‌ ఈ ఘనత సాధించనున్నదని పేర్కొంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top