
150 పాయింట్ల సెన్సెక్స్ లాభం ఆవిరి
విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా అమ్మకాలు జరుపుతున్నందున, భారత్ మార్కెట్ గురువారం ట్రేడింగ్ తొలిదశలో ఆర్జించిన లాభాల్ని నిలుపుకోలేకపోయింది.
ముంబై: విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా అమ్మకాలు జరుపుతున్నందున, భారత్ మార్కెట్ గురువారం ట్రేడింగ్ తొలిదశలో ఆర్జించిన లాభాల్ని నిలుపుకోలేకపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 150 పాయింట్ల వరకూ లాభపడి 31,815 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో 31,660 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు కేవలం 0.77 పాయింట్ల పెరుగుదలతో 31,662.74 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,965 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత 9,917 పాయింట్ల వద్దకు తగ్గింది.
చివరకు 13.70 పాయింట్ల లాభంతో 9,930 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మార్కెట్ ప్రారంభం పటిష్టంగా వున్నప్పటికీ, ఉత్తర కొరియా ఉద్రిక్తతలు వెంటాడటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారని విశ్లేషకులు చెప్పారు. ప్రపంచ మార్కెట్లలో ఒడుదుడుకులు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఫలితంగా నెలరోజుల నుంచి బ్లూచిప్ షేర్లు పరిమితశ్రేణిలో కన్సాలిడేటెడ్ అవుతున్నాయని, అయితే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు పటిష్టంగా ట్రేడవుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నప్పటికీ, దేశీయ ఫండ్స్ కొనుగోళ్లతో మార్కెట్లో పెద్ద పతనం సంభవించలేదని ఆయన వివరించారు. క్రితం రోజు రూ. 1300 కోట్లకుపైగా నికర విక్రయాలు జరిపిన విదేశీ ఇన్వెస్టర్లు గురువారం మరో రూ. 500 కోట్లకుపైగా ఉపసంహరించుకున్నారు.