రెండో రోజూ రికార్డులే..  

Sensex gains 93 points at 41953 - Sakshi

క్యూ3 ఫలితాలపై ఆశావహ అంచనాలు  

ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డులకు సూచీలు  

93 పాయింట్ల లాభంతో 41,953కు సెన్సెక్స్‌  

33 పాయింట్లు పెరిగి 12,362కు నిఫ్టీ  

కంపెనీల క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల ఆల్‌టైమ్‌ హై రికార్డులు వరుసగా రెండో రోజూ కొనసాగాయి. సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్, టీసీఎస్‌ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండో ట్రేడింగ్‌ సెషన్‌లో కూడా ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త శిఖరాలకు చేరాయి.

స్టాక్‌ సూచీలు లాభపడటం ఇది వరుసగా నాలుగో రోజు. రోజంతా తీవ్రమైన ఒడిదుడుకులమయంగా పరిమిత శ్రేణిలో సెన్సెక్స్, నిఫ్టీలు కదలాడాయి. అయితే చివరి గంటలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. సెన్సెక్స్‌ 93 పాయింట్ల లాభంతో 41,953 పాయింట్ల వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 12,362 పాయింట్ల వద్ద ముగిశాయి. కీలకమైన 42,000 పాయింట్ల మైలురాయికి సెన్సెక్స్‌ 47 పాయింట్ల దూరంలో ఉండగా, నిఫ్టీ కీలకమైన 12,350 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్‌గా ట్రేడైంది. లోహ, ఐటీ, కన్సూమర్, వాహన షేర్లు పెరిగాయి. బ్యాంక్, ఇంధన, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.  

ద్రవ్యోల్బణం పెరుగుతున్నా...
రిటైల్‌ ద్రవ్యోల్బణం ఐదేళ్ల గరిష్ట స్థాయికి ఎగిసినా మార్కెట్‌ ముందుకే దూసుకుపోయిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ఎనలిస్ట్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. బడ్జెట్‌లో మరిన్ని తాయిలాలను కేంద్రం ప్రకటించగలదన్న ఆశలున్నాయని, కంపెనీల క్యూ3 ఫలితాలపై ఆశావహ అంచనాలూ లాభాలకు కారణమన్నారు.
- హీరో మోటొకార్ప్‌ షేర్‌ 2.1 శాతం లాభంతో రూ.2,408 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
- రుణ నాణ్యత ఒకింత తగ్గడంతో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.8 శాతం నష్టంతో రూ.1,470 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. 
పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌హైలను తాకాయి. హెచ్‌డీఎఫ్‌సీ, దివీస్‌ ల్యాబ్స్, బెర్జర్‌ పెయింట్స్, హెచ్‌సీఎల్‌ టెక్, ఇప్కా ల్యాబ్స్, మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్, ఎన్‌ఐఐటీ టెక్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top