మార్కెట్‌కు నచ్చలే..!

Sensex Down By 988 Points Nifty Below 11,700 On Union Budget Day - Sakshi

అంచనాలు తారుమారు

ప్రత్యేక ట్రేడింగ్‌ రోజు భారీ నష్టాలు

40,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్‌

988 పాయింట్ల పతనంతో 39,736కు సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 1,092 పాయింట్ల క్షీణత

11,700 పాయింట్ల దిగువకు నిఫ్టీ 300 పాయింట్ల నష్టంతో 11,662 వద్ద ముగింపు

కొండంత రాగం తీసి, ఏదో... చెత్త పాట పాడాడు అని ఒక సామెత ఉంది. ఈ సామెత శనివారం జరిగిన ప్రత్యేక స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌కు పూర్తిగా వర్తిస్తుంది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్‌నివ్వడానికి కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుంటుందని అంచనాలు ఎప్పటికప్పుడూ పెరుగుతూ పోయాయి. ఆదాయపు పన్ను, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఎల్‌టీసీజీ) విషయాల్లో  ఊరటనిచ్చే నిర్ణయాలు ఉండగలవని, సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ), డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ)లను రద్దు చేస్తారని....ఇలా ఎన్నో ఆశలు రాజ్యమేలాయి.

కరోనా వైరస్‌ కల్లోలంతో ప్రపంచ మార్కెట్లు కుదేలైనా, మన మార్కెట్‌ మాత్రం బడ్జెట్‌పై ఆశలతో పెద్దగా పడలేదు. తీరా చూస్తే, ఈ ఆశలన్నింటినీ ఆర్థిక మంత్రి సీతమ్మ వమ్ము చేశారు. బడ్జెట్‌ అంచనాలను తప్పడంతో మార్కెట్‌ నష్టపోయింది.  సెన్సెక్స్‌  40,000 పాయింట్లు, నిఫ్టీ 11,700 పాయింట్లు దిగువకు పడిపోయాయి. ఇంట్రాడేలో 1,275 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 988 పాయింట్ల నష్టంతో 39,736 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక  నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయి 11,662 పాయింట్ల వద్దకు చేరింది.  సెన్సెక్స్‌ 2.43 శాతం, నిఫ్టీ 2.51 శాతం మేర నష్టపోయాయి.

రూ. 3.46 లక్షల కోట్ల సంపద ఆవిరి 
మార్కెట్‌ భారీ పతనం కారణంగా రూ.3.46 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.3,46,257 కోట్లు హరించుకుపోయి రూ.1,53,04,725 కోట్లకు పడిపోయింది.

జీడీపీ వృద్ధి పడిపోయి, వినియోగ డిమాండ్‌ కొరవడి గత ఏడాదికాలంగా ప్రపంచ ఈక్విటీ ర్యాలీలో బాగా వెనుకబడిన మన మార్కెట్‌ను ఆర్థిక మంత్రి సీతారామన్‌...బడ్జెట్‌తో పరుగులు పెట్టిస్తారంటూ ఇన్వెస్టర్లు పెట్టుకున్న భారీ అంచనాలు పటాపంచలయ్యాయి. ఫలితమే సెన్సెక్స్‌ 988 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్ల క్రాష్‌. నాలుగు నెలల క్రితం ఆశ్చర్యకరంగా కార్పొరేట్‌ పన్నును తగ్గించిన ఆర్థిక మంత్రి సీతారామన్‌...అదే బహుమతిని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కూడా ఇవ్వడం ఖాయమేనన్న మార్కెట్‌ అంచనాలు పూర్తిగా వాస్తవరూపం దాల్చలేదు.

శ్లాబుల్ని విభ జించి, రూ.5 లక్షలకుపైబడి పన్ను ఆదాయం కలిగిన వారికి రేట్లు కొంత తగ్గించినప్పటికీ, మరోవైపు వివిధ సెక్షన్ల కింద లభిస్తున్న మినహాయింపుల్ని ఎత్తివేయడంతో మధ్య ఆదాయ వర్గాలకు ఒరిగేదేమీ లేకపోవడం మార్కెట్‌ను షాక్‌కు గురిచేసింది. ఆయా మినహాయింపుల ద్వారా భారీ వ్యాపారాన్ని పొందుతున్న ఇన్సూరెన్స్‌ కంపెనీల షేర్లు నిలువునా పతనంకావడం, వాటి మాతృ సంస్థలైన పెద్ద ఫైనాన్షియల్‌ సంస్థల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవడం ఇందుకు నిదర్శనం.

డీడీటీపై డబుల్‌గేమ్‌... 
అలాగే మరోవైపు డివిడెండ్‌ పంపిణీ పన్ను (డీడీటీ) పూర్తిగా ఎత్తివేస్తారన్న గట్టి అంచనాలు మార్కెట్లో వున్నాయి. ఈ పన్నును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించినా, వాస్తవానికి పన్ను చెల్లింపు బాధ్యతను కంపెనీల నుంచి ఇన్వెస్టర్లకు ఆర్థిక మంత్రి మళ్లించారు. ఇప్పటివరకూ 20 శాతం డీడీటీని కంపెనీలు చెల్లిస్తుండగా, ఇకనుంచి ఇన్వెస్టర్లు వారి వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబుల్ని అనుసరించి, డివిడెండ్ల రూపేణా వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలి.

అధిక ట్యాక్స్‌ శ్లాబ్‌ రేట్లలో వుండే సంపన్నులు, ఆయా కంపెనీల ప్రమోటర్లు 43 శాతం పన్నును ఈ డివిడెండ్‌ ఆదాయంపై చెల్లించాల్సివుంటుంది. అలాంటప్పుడు ప్రమోటర్లు... ఆయా కంపెనీలు భారీ డివిడెండ్లు చెల్లించేందుకు ఎందుకు అంగీకరిస్తారు? బైబ్యాకో, మరో పద్ధతో అనుసరిస్తారు. ఈ కారణంగా ఆర్థిక మంత్రి ప్రకటించిన డీడీటీ ఎత్తివేత ప్రతిపాదన కూడా మార్కెట్‌ను మెప్పించలేకపోయింది.  ఇక అంచనాలకు అనుగుణంగా లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ (ఎల్‌టీసీజీ)పై పన్ను ఎత్తివేతా జరగలేదు.

కేటాయింపుల సంగతేంటి? 
వ్యవసాయ, మౌలిక రంగాలకు భారీ కేటాయింపులు జరపడం దీర్ఘకాలికంగా మేలు చేకూర్చేదే అయినా, ముఖ్యంగా మౌలిక రంగానికి ప్రతిపాదించిన రూ. లక్ష కోట్ల కేటాయింపులకు సంబంధించి నిర్దిష్టమైన ప్రణాళికలు ఏవీ వెల్లడికాలేదు.

ద్రవ్యలోటు ఆందోళనలు... 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గత బడ్జెట్లో నిర్దేశించుకున్న 3.3% ద్రవ్యలోటు మించిపోయిందని, అది 3.8 శాతానికి చేరుతుందని స్వయానా ఆర్థిక మంత్రే తన తాజా బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి 3.5% ద్రవ్యలోటును ప్రతిపాదించారు.

బ్యాంకులు బెంబేలు... 
ప్రభుత్వ రంగ బ్యాంకులకు గత కొన్నాళ్లుగా లక్షల కోట్ల మూలధనాన్ని సమకూరుస్తూ, వాటిని ఆదుకుంటున్న కేంద్రం ఈ బడ్జెట్లో తాజా మూలధన కల్పన ప్రకటించకపోగా, క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి అవి నిధుల్ని సమీకరించుకోవాలంటూ ఘంటాపథంగా చెప్పడం మార్కెట్‌కు మరో పెద్ద షాక్‌.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top