ఆగని విలయం!

Sensex crashes 2713 points as coronavirus fears hit investor sentiment - Sakshi

సెన్సెక్స్‌  2,713 పాయింట్లు డౌన్‌

కొనసాగుతున్న కరోనా వైరస్‌ కల్లోలం

ప్రపంచ వ్యాప్తంగా పతన బాటలోనే మార్కెట్లు 

ప్రభావం చూపని ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల తగ్గింపు 

మాంద్యం భయాలను పెంచిన చైనా గణాంకాలు 

ఆరంభంలోనే వెయ్యి పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ 31,390 వద్ద ముగింపు 

758 పాయింట్ల నష్టంతో 9,197కు నిఫ్టీ

మూడేళ్ల కనిష్టానికి నిఫ్టీ, సెన్సెక్స్‌ రెండున్నరేళ్ల కనిష్టం 

చరిత్రలో ఇదే రెండో అత్యధిక పతనం

కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ కల్లోలం కొనసాగుతుండటంతో స్టాక్‌ మార్కెట్‌ సోమవారం భారీగా నష్టపోయింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఫండ్ల రేట్లను దాదాపు సున్నా స్థాయికి తగ్గించినప్పటికీ, భారత్‌తో పాటు ప్రపంచ దేశాల స్టాక్‌ మార్కెట్లన్నీ పతనబాటలోనే సాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 32,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,200 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్‌ చరిత్రలోనే రెండో అతి పెద్ద పతనాన్ని నమోదు చేసింది. 2,713 పాయింట్లు క్షీణించి 31,390 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 758 పాయింట్లు పతనమై 9,197 పాయింట్ల  వద్దకు చేరింది. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 7.96 శాతం, నిఫ్టీ 7.61 శాతం చొప్పున క్షీణించాయి. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. నిఫ్టీ మూడేళ్లు, సెన్సెక్స్‌ రెండున్నరేళ్ల కనిష్టానికి పడిపోయాయి.  

ఆరంభం నుంచి అదే వరుస....
ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 1,000 పాయింట్ల నష్టంతో 33,103 పాయింట్ల వద్ద, నిఫ్టీ 368 పాయింట్లు పతనమై 9,588 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 2,827 పాయింట్లు, నిఫ్టీ 790 పాయింట్ల మేర పతనమయ్యాయి. ఈ నెల 12న సెన్సెక్స్‌ 2,919 పాయింట్లు, నిఫ్టీ 868 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. చరిత్రలో ఇదే అతి పెద్ద పతనం. సోమవారం రెండో అతి పెద్ద పతనం నమోదైంది. వారం వ్యవధిలో స్టాక్‌ సూచీలు ఇలా భారీ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి.  శుక్రవారం   విరామం అనంతరం స్టాక్‌ మార్కెట్‌లో నష్టాలు మళ్లీ కొనసాగాయి.  

ఎదురీదిన యస్‌ బ్యాంక్‌
అన్ని రంగాల షేర్లు భారీగా పతనమైనప్పటికీ, యస్‌ బ్యాంక్‌ షేర్‌ మాత్రం 45% ఎగసి రూ.37కు చేరింది.  యస్‌ బ్యాంక్‌లో వివిధ బ్యాంక్‌లు రూ.10,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తుండటం, నగదు విత్‌డ్రాయల్‌ పరిమితులను మరో 2 రోజుల్లో తొలగించనుండటం సానుకూల ప్రభావం చూపాయి.

రూ.7.6 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.7.6 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.7.62
లక్షల కోట్లు హరించుకుపోయి రూ.121.63 లక్షల కోట్లకు పడిపోయింది.

నష్టాలు ఎందుకంటే....
 కోవిడ్‌–19 వైరస్‌ కల్లోలం....
కోవిడ్‌–19 వైరస్‌ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతోంది. సోమవారం తాజాగా 9 కొత్త దేశాలకు పాకింది. మరోవైపు ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో ఇప్పటివరకూ కరోనా కేసుల సంఖ్య 110కు, మరణాలు రెండుకు చేరాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 1.70 లక్షల మందికి ఈ వైరస్‌ సోకగా, 6,500 మందికి పైగా మరణించారు.  

గణాంకాలతో గజగజ....
చైనా తయారీ రంగ, రిటైల్‌ అమ్మకాల గణాంకాలు సోమవారం వెలువడ్డాయి. చైనా తయారీ రంగ సూచీ 30 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది.  రిటైల్‌ అమ్మకాలు కూడా బారీగా తగ్గాయి.  కోవిడ్‌–19 వైరస్‌ కల్లోలం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందనే భయాలను ఈ గణాంకాలు మరింతగా పెంచాయి.  

ప్రపంచ మార్కెట్ల పతనం.....
ఆసియా మార్కెట్లు 2–4 శాతం రేంజ్‌లో నష్టపోవడం, యూరప్‌ మార్కెట్లు ఆరంభంలోనే 8 శాతం పతనం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.  

ముడి చమురు ధరలు మరింత పతనం....
ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో వినియోగం తగ్గి, డిమాండ్‌ కూడా తగ్గగలదన్న ఆందోళనతో ముడి చమురు ధరలు 10 శాతం మేర దిగివచ్చాయి.  

అమెరికా వడ్డీ రేట్లు @ 0 ఫెడ్‌ మరో అనూహ్య కోత
వాషింగ్టన్‌: అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌–  ఫెడరల్‌ రిజర్వ్‌ రెండు వారాల్లోనే రెండోసారి వడ్డీ రేట్లలో కోత  పెట్టింది. అదీ ఏకంగా 1 శాతం తగ్గించేసింది.  వెరసి ప్రస్తుతం ఫెడ్‌ ఫండ్‌ రేటు సున్నా (0–0.25 శాతం) స్థాయికి చేరింది.  రెండు వారాల్లోనే రేటును ఫెడ్‌  ఏకంగా 1.5 శాతం తగ్గించడం గమనార్హం. నిజానికి ఈ నెల 17, 18 తేదీల్లో  ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశాన్ని నిర్వహించవలసి ఉంది. అయితే కోవిడ్‌–19 సృష్టిస్తున్న విలయం కారణంగా రెండు వారాల క్రితం తొలిసారి అత్యవసర ప్రాతిపదికన 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించింది.  ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారు జామున) వడ్డీ రేట్లను సున్నా స్థాయికి చేర్చుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా 700 బిలియన్‌ డాలర్లతో భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు బాండ్లను కొనుగోలు చేయనుంది.  తాజా రేటు కోత నేపథ్యాన్ని పరిశీలిస్తే, కరోనా వైరస్‌తో ప్రపంచం నిలువెల్లా వణుకుతోంది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ కోవిడ్‌–19 వైరస్‌ ప్రభావానికి లోనైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా అమెరికా  ఆర్థిక వ్యవస్థసైతం తీవ్ర అనిశ్చితిలో పడిపోయింది.  
 
ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌

2008 తదుపరి...
2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు దారితీసిన సబ్‌ప్రైమ్‌ సంక్షోభ సమయంలో వృద్ధికి ఊతం అందించడానికి  అమెరికా ఫెడ్‌ ఫండ్‌ రేటును సున్నా స్థాయికి తగ్గించడం జరిగింది. తరువాత కొన్ని సానుకూల ఆర్థిక అంశాలతో ఈ రేటు 2.5 శాతం వరకూ పెరుగుతూ వచ్చింది. అటు తర్వాత గడచిన సంవత్సర కాలంలో వేగంగా తిరిగి సున్నా స్థాయికి చేరింది.  తాజాగా ఫెడ్‌ వడ్డీ రేట్లలో భారీ కోతలను చేపట్టడంతోపాటు.. బ్యాంకులు నగదు నిల్వలను వినియోగించుకునేందుకు వీలుగా రిజర్వ్‌ రిక్వైర్‌మెంట్స్‌ నిబంధనలు సడలించింది.  

అధ్యక్షుని ప్రశంసలు...
మరోవైపు  అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫెడ్‌ నిర్ణయాలను ప్రశంసించారు. ఫెడ్‌ చర్యలను ఊహించలేదని..ఇదెంతో సంతోషకర విషయమని వ్యాఖ్యానించారు. ఇటీవల ఎదురవుతున్న సంక్షోభాల నుంచి ఆర్థిక వ్యవస్థ గట్టెక్కినట్లు విశ్వసించేవరకూ కనీస వడ్డీ రేట్లనే కొనసాగించనున్నట్లు ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఎదురవుతున్న క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే బాటలో ఇటీవల ఫెడ్‌ 0.5 శాతం వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు.. 500 బిలియన్‌ డాలర్లను వ్యవస్థలోకి విడుదల చేసే చర్యలను చేపట్టిన సంగతి తెలిసిందే.  

అనుసరించనున్న ఆర్‌బీఐ!
మరోవైపు భారత్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆర్‌బీఐ కూడా రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.15%) బాటలో నిలు స్తుందన్న సంకేతాలను ఇచ్చారు గవర్నర్‌ శక్తికాంత దాస్‌. ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘కరోనా ప్రభావం నుంచి భారత్‌ ఆర్థిక వ్యవస్థ బయటపడటానికి ఆర్‌బీఐ వద్ద తగిన విధానపరమైన సాధనాలు ఉన్నాయి’’ అన్నారు.
ఏప్రిల్‌ 3న పాలసీ సమీక్ష నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ వ్యాఖ్యలు చేశారు.  ఇటీవలి పాలసీ సమీక్ష సందర్భంగా రేటు కోత నిర్ణయం ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ, ‘‘ప్రస్తుత చట్టం ప్రకారం, రేట్‌ కోత నిర్ణయాన్ని ద్రవ్య విధాన కమిటీ తీసుకుంటుంది. రేటు కోత నిర్ణయాన్ని తోసిపుచ్చలేను. పరిస్థితులకు అనుగుణంగా తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది’’ అన్నారు. వ్యవస్థలో  లిక్విడిటీ సమస్యల్లేకుండా చర్యలు తీసుకుంటామని దాస్‌ పేర్కొ న్నారు. కోవిడ్‌ ఆందోళనలతో అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌సహా దాదాపు 43 సెంట్రల్‌ బ్యాంకులు రేటు కోత నిర్ణయం తీసుకున్నాయి.

రూపాయి, క్రూడ్‌ క్రాష్‌
ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి పతన ధోరణి కొనసాగుతోంది.  ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో సోమవారం ఒకేరోజు 50 పైసలు పడిపోయి 74.25 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా నెలకొన్న కోవిడ్‌–19 భయాలు,  ప్రపంచాభివృద్ధిపై దీని ప్రభావం, రేటు కోతతో వృద్ధికి ఊతం ఇవ్వాలని భావించిన అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌– ఫెడ్‌ నిర్ణయం... వెరసి మాంద్యం భయాలు భారత్‌ కరెన్సీపై  ప్రభావం చూపుతున్నాయి. ఈక్విటీ భారీ నష్టాలూ ఇక్కడ గమనార్హం.  శుక్రవారం రూపాయి ముగింపు 73.75.  ట్రేడింగ్‌ మొత్తంమీద 74.09 గరిష్ట–74.35 కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. రూపాయి కనిష్ట స్థాయిల చరిత్ర గురించి చూస్తే ఈ నెల 12, 13తేదీల ఇంట్రాడేల్లో వరుసగా  74.50ని చూసినా, ఇప్పటి వరకూ కనిష్ట స్థాయి ముగింపు మాత్రం  74.39.    

 

క్రూడ్, బంగారం ‘బేర్‌’  
మరోవైపు ఈక్విటీ మార్కెట్లతో పాటు కమోడిటీ మార్కెట్లూ కరోనా కాటుకు బలవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నైమెక్స్‌ క్రూడ్‌ బేరల్‌ ధర ఈ వార్త రాసే సమయం 10.35కు 8.35 శాతం నష్టంలో (2.68 డాలర్లు) 29.43 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్‌ ఒక దశలో 28.52 డాలర్లనూ చూసింది.  బ్రెంట్‌ బ్యారల్‌ ధర ఇదే సమయానికి 11.73 శాతం  నష్టంతో 29.88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 29.55 డాలర్లనూ చూసింది. ఇక పసిడి విషయానికి వస్తే, ఔన్స్‌ (31.1గ్రా) ధర 5 డాలర్ల నష్టంతో 1,512 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో ఈ యల్లో మెటల్‌ ధర 1,451 డాలర్లనూ చూడ్డం గమనార్హం. తాజా పరిస్థితుల నేపథ్యంలో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర దేశీయంగా రూ.40,000 లోపునకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్తరాసే సమయంలో దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌–ఎంసీఎక్స్‌లో పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.500కుపైగా నష్టంతో రూ.39,775 వద్ద ట్రేడవుతోంది.

ఎస్‌బీఐ కార్డ్స్‌కు కరోనా సెగ
ఎస్‌బీఐ అనుబంధ కంపెనీ, ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ షేర్ల లిస్టింగ్‌పై కోవిడ్‌–19 వైరస్‌ తీవ్రంగానే ప్రభావం చూపించింది. ఈ వైరస్‌ కారణంగా ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్‌ కూడా భారీగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ షేర్ల లిస్టింగ్‌ కూడా పేలవంగానే జరిగింది. మరోవైపు కొన్ని కంపెనీలు తమ ఐపీఓలను వాయిదా వేశాయి. కాగా పార్క్‌ హోటల్స్‌ ఐపీఓకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, ఆమోదం తెలిపింది.  
 

13 శాతం నష్టంతో లిస్టింగ్‌.....  
ఇష్యూ ధర, రూ.755తో పోల్చితే ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ షేర్‌ బీఎస్‌ఈలో 13 శాతం నష్టంతో రూ.658 వద్ద లిస్టయింది. ఈ షేర్‌కు ఇదే ఇంట్రాడే కనిష్ట స్థాయి. ఇంట్రాడేలో ఇష్యూ ధర, రూ.755కు ఎగసినప్పటికీ, చివరకు 9.5 శాతం నష్టంతో రూ.683 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 41.6 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 6.08 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.57,199 కోట్లకు చేరింది.  
ఈ నెలలోనే వచ్చిన ఈ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) 22 రెట్లకు పైగా ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.10.000 కోట్ల మేర నిధులు సమీకరించింది.  

రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ.308 కోట్ల నష్టం..

  పేలవంగా లిస్టింగ్‌ 
10% నష్టంతో రూ. 683 వద్ద ముగింపు

ఐపీఓలో భాగంగా రిటైల్‌ ఇన్వెస్టర్లకు (రూ.2 లక్షల కంటే తక్కువగా ఇన్వెస్ట్‌ చేసేవాళ్లు) 4.27 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించారు. ఇష్యూ ధర రూ.755తో పోల్చితే ఈ షేర్‌ బీఎస్‌ఈలో రూ.72 నష్టంతో రూ.683 వద్ద ముగిసింది. ఒక్కో షేర్‌కు రూ.72 నష్టం పరంగా చూస్తే, మొత్తం రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ.308 కోట్ల నష్టం వచ్చింది. అలాగే క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు రూ.174 కోట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు రూ.132 కోట్ల మేర నష్టాలు వచ్చాయి.   
 
మరిన్ని విశేషాలు....

సెన్సెక్స్‌లోని అన్ని షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 17.5 శాతం క్షీణించి రూ.663 వద్ద ముగిసింది సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. టాటా స్టీల్‌ 11 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 11 శాతం,  యాక్సిస్‌ బ్యాంక్‌ 10 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 10% మేర నష్టపోయాయి.  
► యస్‌ బ్యాంక్‌ తరహానే త్వరలోనే సంక్షోభంలోకి జారిపోగలదన్న భయాలు చెలరేగడంతో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 21% నష్టపోయి రూ.163 వద్ద ముగిసింది.  
► వివిధ రాష్ట్రాల్లో సినిమా హాళ్లను ఈ నెల 31 వరకూ మూసేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడంతో మల్టీప్లెక్స్‌లను నిర్వహించే పీవీఆర్, ఐనాక్స్‌ లీజర్‌ షేర్లు 19 శాతం వరకూ నష్టపోయాయి.  
► దాదాపు 500కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బంధన్‌ బ్యాంక్, పీవీఆర్, ఆర్‌బీఎల్‌ బ్యాంక్, యూపీఎల్, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్, ఇక్రా, పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్, శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఈ జాబితా కొన్ని.  
► 600కు పైగా షేర్లు లోయర్‌ సర్క్యూట్లను తాకాయి. అవెన్యూ సూపర్‌మార్ట్స్, ఐఆర్‌సీటీసీ, ఆఫిల్‌ ఇండియా, సువెన్‌ ఫార్మా, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్, వెల్‌స్పన్‌  తదితర షేర్లు  ఈ జాబితాలో ఉన్నాయి.  
► సెన్సెక్స్‌ 2,700 పాయింట్ల నష్టంలో హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షేర్ల వాటాయే దాదాపు నాలుగో  వంతుగా ఉంది. ఈ రెండు షేర్లు కలిసి 660 పాయింట్ల మేర సెన్సెక్స్‌కు పడగొట్టాయి. సెన్సెక్స్‌ను....రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 276 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ 271 పాయింట్లు, ఇన్ఫోసిస్‌ 211 పాయింట్ల మేర నష్టపరిచాయి.  

ఫెడ్‌ తగ్గించినా... నష్టకష్టాలే!
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ అత్యవసర చర్యల్లో భాగంగా ఆదివారం ఫండ్స్‌ రేట్‌ను దాదాపు సున్నా స్థాయికి తగ్గించింది. ప్రస్తుతం ఈ ఫండ్స్‌ రేటు 0–0.25 శాతం రేంజ్‌లో ఉంది. ఈ రేట్ల ఆధారంగానే బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు రుణాలపై వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి. అంతే కాకుండా 70,000 కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఒక్క వారంలో ఫండ్స్‌ రేట్లను ఫెడరల్‌ రిజర్వ్‌ తగ్గించడం ఇది రెండోసారి. 2008లో సబ్‌ప్రైమ్‌ సంక్షోభం నెలకొన్నప్పుడు కూడా ఇలానే ఫెడ్‌ రేట్లను తగ్గించింది. సాధారణ పరిస్థితుల్లో ఫెడ్‌ రేట్లను తగ్గిస్తే, అదీ సున్నా స్థాయికి వస్తే, ప్రపంచ మార్కెట్లు లాభాలతో ఊగిపోయేవి. కానీ ఈ సారి పరిస్థితి రివర్స్‌ అయింది. ఆర్థిక సంక్షోభం అంచనాలను మించి ఉంటుందని, ఫెడ్‌ రేట్లను తగ్గించడం దీనికి సంకేతమన్న భావనతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి.

పార్క్‌ హోటల్స్‌ ఐపీఓ @ రూ.1,000 కోట్లు...
పార్క్‌ హోటల్స్‌ ఐపీఓకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా రూ.400 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు రూ.600 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో విక్రయిస్తారు. మొత్తం మీద ఈ ఐపీఓ సైజు రూ.1,000 కోట్లు. ఈ కంపెనీ హైదరాబాద్, విశాఖపట్టణం బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, జైపూర్, జోధ్‌పూర్, కోయంబత్తూర్‌ తదితర నగరాల్లో ద పార్క్‌ బ్రాండ్‌  హోటళ్లను నిర్వహిస్తోంది.  

ఐపీఓలు వాయిదా...: కోవిడ్‌–19 వైరస్‌ ధాటికి స్టాక్‌ మార్కెట్‌ విలవిలలాడుతుండటంతో పలు కంపెనీలు తమ ఐపీఓలను వాయిదా వేశాయి. ఈ నెల 4నే మొదలైనా, ఐపీఓను ఈ నెల 16 వరకూ పొడిగించినప్పటికీ, ఇన్వెస్టర్ల నుంచి సరైన స్పందన లేకపోవడంతో అంటోని వేస్ట్‌ హ్యాండ్లింగ్‌ సెల్‌  కంపెనీ తన ఐపీఓను ఉపసంహరించుకుంది. కాగా బర్గర్‌ కింగ్‌ ఇండియా కంపెనీ తన ఐపీఓను వాయిదా వేసుకుందని సమాచారం. ఈ నెలాఖరులో ఐపీఓకు వచ్చి రూ.400 కోట్లు సమీకరించాలనేది ఈ కంపెనీ ప్రణాళిక.

జీడీపీకి కరోనా కాటు!
వృద్ధి 50 బేసిస్‌ పాయింట్లు తగ్గుతుందన్న ఆందోళన
ముంబై: కరోనా వైరస్‌ మహమ్మారి ప్రతాపం మరింత వ్యవధిపాటు కొనసాగితే 2020–21 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు అర శాతం వరకు తగ్గుతుందన్న ఆందోళన దేశీయ కంపెనీల నుంచి వ్యక్తమైంది. అంతేకాదు, ఈ వైరస్‌ ప్రభావం దీర్ఘకాలం కొనసాగితే ద్రవ్యలోటు మరింత పెరిగిపోవడమే కాకుండా బ్యాంకులకు మొండి బాకీలు (ఎన్‌పీఏలు) మరింత జోడవుతాయని పేర్కొన్నాయి.


కరోనా వైరస్‌ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ఉండొచ్చన్న దానిపై రేటింగ్‌ ఏజెన్సీ కేర్‌ 150 మంది సీఈవోలు, సీఎఫ్‌వోలు, ఇన్వెస్టర్లు, అనలిస్టులు, ఇతర భాగస్వాముల నుంచి అభిప్రాయాలను సేకరించగా ఈ అంశాలు వెల్లడయ్యాయి. వైరస్‌ ఎక్కువ కాలం పాటు ఉంటే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం గణనీయంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. జీడీపీ అరశాతం వరకు తగ్గొచ్చని సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు అభిప్రాయపడితే, 22 శాతం మంది అయితే ఒక శాతం వరకు తగ్గిపోవచ్చని అంచనా వేశారు.

రేట్ల కోతతో కీడే ఎక్కువ
వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు రేట్లను తగ్గించడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతోంది.   కోవిడ్‌ వైరస్‌ ఆర్థికంగా చూపించే ప్రభావం అంచనాల కంటే అధికంగానే ఉండగలదన్న సంకేతాలను కేంద్ర బ్యాంక్‌ల రేట్ల తగ్గింపు  సూచిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి.  

 –వినోద్‌ నాయర్, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎనలిస్ట్‌   

 

పతనం కొనసాగే అవకాశాలే అధికం
దేశీయంగా కోవిడ్‌–19 వైరస్‌ మెల్లమెల్లగా విస్తరిస్తోంది. ఇది ఎక్కడ దాకా చేరుతుందో అంతూ, దరీ తెలియడం లేదు. రానున్న రోజుల్లో ఈ పతనం కొనసాగే అవకాశాలే అధికంగా ఉన్నాయి.  

–అజిత్‌ మిశ్రా, రెలిగేర్‌ బ్రోకింగ్‌ ఎనలిస్ట్‌.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top