12,000 దిగువకు నిఫ్టీ . | Sensex Cracks Over 334 Pts And Nifty Tumbles Below 12000 | Sakshi
Sakshi News home page

12,000 దిగువకు నిఫ్టీ .

Dec 7 2019 4:47 AM | Updated on Dec 7 2019 5:05 AM

Sensex Cracks Over 334 Pts And Nifty Tumbles Below 12000 - Sakshi

కొనుగోళ్లకు పురికొల్పే అంశాలేవీ లేకపోవడం, మందగమన భయాల కారణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో రేట్ల కోతకు ఆర్‌బీఐ విరామం ఇవ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ద్రవ్యలోటుపై ఆందోళన ప్రతికూల ప్రభావం చూపించింది. ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ఉన్నా,  మన మార్కెట్‌ మాత్రం నష్టపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 334 పాయింట్ల నష్టంతో 40,445 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 97 పాయింట్లు పతనమై 11,922 పాయింట్ల వద్ద ముగిశాయి. వారం పరంగా చూస్తే, సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 349 పాయింట్లు, నిఫ్టీ 135 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. బ్యాంక్, వాహన, ప్రభుత్వ రంగ, రియల్టీ, విద్యుత్తు రంగ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి.  

614 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌..
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైనా, ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. చివరి వరకూ నష్టాలు కొనసాగాయి. ఆరంభంలో 172 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ ఒక దశలో 442 పాయింట్ల మేర పతనమైంది. మొత్తం మీద రోజంతా 614 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. వాణిజ్య ఒప్పందం దిశగా ఇరు దేశాలూ సరైన దారిలోనే ఉన్నాయన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా ట్వీట్‌ నేపథ్యంలో ఆసియా, యూరప్‌  మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.  
►ముడి చమురు ఉత్పత్తిలో మరింత కోత ఉండొచ్చన్న వార్తల కారణంగా ఆయిల్, గ్యాస్‌ షేర్లు నష్టపోయాయి.
►యస్‌ బ్యాంక్‌ రేటింగ్స్‌ను మూడీస్‌ సంస్థ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో ఈ బ్యాంక్‌ షేర్‌ 10 శాతం నష్టంతో రూ.56 వద్ద ముగిసింది.
►ప్రభుత్వ తోడ్పాటు లేకపోతే కంపెనీని మూసేస్తామని కంపెనీ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించడంతో వొడాఫోన్‌ ఐడియా షేర్‌ 5  శాతం నష్టంతో రూ.6.92 వద్ద ముగిసింది.  
►బంపర్‌ లాభాలతో స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన ప్రైవేటు రంగ సీఎస్‌బీ బ్యాంక్‌లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఈ షేర్‌ 8 శాతం నష్టంతో రూ. 274 వద్ద ముగిసింది.

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌.. 2,025 కోట్ల సమీకరణ  
ముంబై: ప్రైవేట్‌ రంగ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ రూ.2,025 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ దిగ్గజం బజాజ్‌ ఫైనాన్స్‌తో సహా మొత్తం 40 సంస్థల నుంచి ఈ నిధులను ఈ బ్యాంక్‌ సమీకరించింది. సంస్థాగత కేటాయింపులో భాగంగా ఒక్కో షేర్‌ రూ.352 ధర చొప్పున మొత్తం 5.77 కోట్ల షేర్లను జారీ చేసి ఈ పెట్టుబడులను సమీకరించామని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement