రియల్టీ, ఇన్‌ఫ్రాకు ఊతం..! | Sebi relaxes real estate investment rules | Sakshi
Sakshi News home page

రియల్టీ, ఇన్‌ఫ్రాకు ఊతం..!

Sep 24 2016 1:36 AM | Updated on Nov 9 2018 5:30 PM

రియల్టీ, ఇన్‌ఫ్రాకు ఊతం..! - Sakshi

రియల్టీ, ఇన్‌ఫ్రాకు ఊతం..!

స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ... శుక్రవారం పలు కీలక చర్యలకు దిగింది. రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా రంగాల్లోకి వ్యాపార సంస్థల నుంచి...

రీట్స్, ఇన్‌విట్స్ నిబంధనల్లో సెబీ మార్పులు
నిధుల వినియోగం, స్పాన్సర్ల సంఖ్య సడలింపు
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో ఇక 20% పెట్టుబడులు
పోర్ట్‌ఫోలియో మేనేజర్లుగా విదేశీ ఫండ్ మేనేజర్లు...
సెబీ కీలక నిర్ణయాలు; ఐపీఓల్లో ఉద్యోగుల వాటా పెంపు
ఎస్‌ఎంఎస్, మెయిల్స్‌తో ట్రేడింగ్ టిప్స్‌పై నిషేధం!

ముంబై: స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ... శుక్రవారం పలు కీలక చర్యలకు దిగింది. రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా రంగాల్లోకి వ్యాపార సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించటానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావటంతో... రియల్‌ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (రీట్స్), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్(ఇన్‌విట్స్)లో పెట్టుబడుల నిబంధనల్ని మరింత సడలించింది.

అలాగే దేశంలో స్థిరపడదామనుకుంటున్న విదేశీ ఫండ్ మేనేజర్లకూ నిబంధనల్ని సడలించి, పోర్టు ఫోలియో మేనేజర్లుగా పనిచేయటానికి వారిని అనుమతించింది. ఇక మోసపూరిత ఇన్వెస్ట్‌మెంట్ సలహాదారులకు కళ్లెం వేయటానికి... బల్క్ ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిల్స్ ద్వారా ట్రేడింగ్ టిప్స్ అందించటాన్ని నిషేధించాలని ప్రతిపాదించింది. దీంతో పాటు స్టాక్‌మార్కెట్‌కు సంబంధించి గేమ్స్, పోటీలు, లీగ్‌లు నిర్వహించడానికి కూడా స్వస్తి చెప్పాలని స్పష్టంచేసింది. దీనిపై త్వరలో చర్చాపత్రాన్ని విడుదల చేయనున్నట్లు సెబీ తెలియజేసింది.

వీటన్నిటితో పాటు... పబ్లిక్ ఇష్యూకు వచ్చే కంపెనీలు తమ ఉద్యోగులకు మరిన్ని షేర్లు కేటాయించడానికి వీలు కల్పించింది. ఇప్పటిదాకా కంపెనీలు తమ ఉద్యోగులకు రూ.2 లక్షల మేరకు మాత్రమే గరిష్టంగా షేర్లు కేటాయించే వీలుండేది. దీన్ని రూ.5 లక్షలకు పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలివీ...
 
రీట్స్, ఇన్‌విట్స్ నిబంధనల్ని 2014లోనే సెబీ నోటిఫై చేసింది. దీంతో ఈ ట్రస్ట్‌లు ఏర్పాటు చేయటానికి, వీటిని మార్కెట్లో లిస్ట్ చేయటానికి వీలు కలిగింది. పన్ను మినహాయింపుల వంటివి లేవకపోవటంతో విదేశీ మార్కెట్లలో బాగా ప్రజాదరణ ఉన్న ఈ ట్రస్ట్‌లకు దేశంలో మాత్రం ఆదరణ కరువయింది. ఐఆర్‌బీ, జీఎంఆర్, ఎంఈపీ ఇన్‌ఫ్రా కంపెనీలకు ఇన్‌విట్స్ ఆరంభించటానికి సెబీ గతంలోనే అనుమతులిచ్చింది. తాజా బడ్జెట్లో ప్రభుత్వం పన్ను రాయితీలు కొన్ని ప్రకటించటంతో నిబంధనల సరళీకరణకు సెబీ నిర్ణయించింది. దీని ప్రకారం...
* హోల్డింగ్ కంపెనీ పెట్టి రెండంచెల వ్యవస్థ (ప్రత్యేక కంపెనీలు) ద్వారా రీట్స్, ఇన్‌విట్స్ పెట్టుబడులు పెట్టొచ్చు.
* స్పాన్సర్ చేసేవారి సంఖ్యపై ఇక పరిమితులుండవు. ప్రస్తుతం ముగ్గురు స్పాన్సర్లుండాలనే నిబంధన ఉంది.
* ఎస్‌పీవీల ద్వారా సమీకరించే నిధుల్లో నూటికి నూరు శాతాన్నీ, మిగిలిన నిధుల్లో 90 శాతాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటానికి హోల్డింగ్ కంపెనీకి అనుమతి ఉంటుంది.
* నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో రీట్స్ 10 శాతం మాత్రమే పెట్టుబడులు పెట్టాలనే నిబంధన ఉండేది. దీన్ని 20 శాతానికి పెంచారు.
* ఇన్‌విట్స్‌కు సంబంధించి తప్పనిసరిగా స్పాన్సర్ కలిగి ఉండాల్సిన హోల్డింగ్‌ను 15 శాతానికి కుదించింది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌కు సంబంధించిన నిబంధనలనూ సడలించింది.
 
విదేశీ ఫండ్ మేనేజర్లకు ఊరట...: భారతదేశంలో స్థిరపడాలనుకునే విదేశీ ఫండ్ మేనేజర్లు పోర్టు ఫోలియో మేనేజర్లుగా కొనసాగటానికి అనుమతిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన సమావేశంలో 1993 నాటి పోర్టుఫోలియో మేనేజర్ల నిబంధనల్ని సెబీ సవరించింది. దీని ప్రకారం... అర్హులైన ఫండ్ మేనేజర్లకు ఎలాంటి నిబంధనలుండాలో, ఎవరు అనర్హులో తెలియజేసింది.
 
ఐపీఓల్లో ఉద్యోగులకు రూ.5 లక్షల వరకు షేర్లు
పబ్లిక్ ఆఫర్ సమయంలో కంపెనీలు వారి ఉద్యోగులకు స్టాఫ్ కోటా కింద అధిక షేర్లను కేటాయించడానికి సెబీ అంగీకరించింది. దీంతో కంపెనీ తన పబ్లిక్ ఆఫర్‌లో ఒక ఉద్యోగికి రూ.5 లక్షల విలువ వరకు షేర్లకు కేటాయించొచ్చు. ఈ పరిమితి ఇదివరకు రూ.2 లక్షలుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement