ఇక రోజుకు రూ.20వేలే!! | SBI halves daily ATM withdrawal limit to Rs 20000 to curb frauds | Sakshi
Sakshi News home page

ఇక రోజుకు రూ.20వేలే!!

Oct 2 2018 12:21 AM | Updated on Oct 2 2018 12:21 AM

SBI halves daily ATM withdrawal limit to Rs 20000 to curb frauds - Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయల్‌ పరిమితిని సగానికి సగం తగ్గించేస్తోంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.40,000 ఉండగా... దీనిని ఈ నెలాఖరు నుంచి రూ.20,000కు తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది. మోసపూరిత లావాదేవీలు పెరిగిపోతుండడంతో, కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్‌ సోమవారం ప్రకటించింది.

తాజా నిర్ణయం వల్ల ఏటీఎంల ద్వారా ఒకేరోజు పెద్ద మొత్తంలో నిధుల విత్‌డ్రా చేయడానికి అవకాశం ఉండదు. దీనివల్ల మోసగాళ్లు సైతం రోజుకు రూ.20వేల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేయలేరు కనక ఒకవేళ ఎవరైనా మోసపోయినా మరీ ఎక్కువ మొత్తాన్ని పోగొట్టుకోకుండా ఉంటారన్నది తమ ఉద్దేశమని బ్యాంకు తెలియజేసింది. ఏదైనా మోసపూరిత విత్‌డ్రాయల్‌ జరిగితే వెంటనే కార్డ్‌ బ్లాక్‌ చేయించుకోవడం, సంబంధిత బ్రాంచీని సంప్రదించడం చేయాలని, దాంతో నష్టాన్ని పరిమితం చేసుకోవచ్చని కూడా సూచించింది.

ఈ నిర్ణయం  అక్టోబర్‌ 31 నుంచీ అమల్లోకి వస్తుంది. ‘‘క్లాసిక్‌–డెబిట్‌ కార్డ్‌పై విత్‌డ్రాయల్‌ పరిమితిని రూ.20,000కు తగ్గిస్తున్నాం. ఇతర కార్డులకు సంబంధించి రోజూవారీ విత్‌డ్రాయల్‌ పరిమితిలో ఎలాంటి మార్పూ లేదు. క్లాసిక్‌–డెబిట్‌ కార్డ్‌ చిప్‌ ఆధారితం కాదు. కాబట్టి సెక్యూరిటీ పరమైన ఆందోళనలు ఉన్నాయి. పలు ఫిర్యాదులూ అందాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని సీనియర్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ఒకరు తెలిపారు.

దేశ వ్యాప్తంగా ఎస్‌బీఐకి దాదాపు 42 కోట్ల మంది కస్టమర్లున్నారు. 2018 మార్చి నాటికి బ్యాంక్‌ 39.50 కోట్ల డెబిట్‌ కార్డులను జారీ చేసింది. వీటిలో దాదాపు 26 కోట్ల కార్డుల వినియోగం పూర్తి క్రియాశీలంగా ఉంది. డెబిట్‌ కార్డుల జారీకి సంబంధించి ఎస్‌బీఐ మార్కెట్‌ వాటా దాదాపు 32.3 శాతం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement