
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రుణ రేటును, రిటైల్ టర్మ్ డిపాజిట్ రేట్లను తగ్గించింది. బుధవారం నుంచే కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. ముఖ్యాంశాలు చూస్తే...
►వివిధ మెచ్యూరిటీలపై మార్జినల్ కాస్ట్ ఆధారిత రుణరేట్లను స్వల్పంగా (ఎంసీఎల్‌ఆర్) 5 బేసి స్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) తగ్గించింది. బ్యాంక్ ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం 10 నెలల్లో ఇదే తొలిసారి. పెద్ద నోట్ల రద్దు, భారీ డిపాజిట్ల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో ఎంసీఎల్‌ఆర్ రేట్లను ఎస్‌బీఐ తగ్గించింది.
►ఏడాది కాలపరిమితి ఎంసీఎల్‌ఆర్ 8 శాతం నుంచి 7.95 శాతానికి తగ్గింది.
► రిటైల్ టర్మ్ డిపాజిట్ రేట్లను సైతం పావు శాతం తగ్గించింది.
ఆర్‌బీఐ ఒత్తిడి వల్లే...: 2015 జనవరి నుంచీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతం) రేటును దాదాపు 2 శాతం తగ్గిస్తే, బ్యాంకులు మాత్రం ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు యథాతథంగా అందించడం లేదన్న విమర్శల నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. తమపై పడే తాజా నిధుల సమీకరణ భారాన్ని బేరీజు వేసుకుంటూ, దాదాపు నెలవారీగా బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ను సమీక్షిస్తున్నాయి. గత ఏడాది ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల కస్టమర్లకు పాలసీ రేట్ల ప్రయోజన బదలాయింపు కొంతలో కొంత వేగవంతమైంది. మూడేళ్ల నుంచీ మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం ఇచ్చే క్రమంలో రుణ వృద్ధి, ప్రైవేటు పెట్టుబడులు పెరగాలని ఆర్‌బీఐ సూచిస్తోంది. ఇందుకు బ్యాంకింగ్ రుణ రేట్ల తగ్గింపు అవసరమని పేర్కొంటోంది.