పేమెంట్ బ్యాంకుల పోటీని తట్టుకుంటాం | sakshi interview with Vijaya Bank executive director BS Rama Rao | Sakshi
Sakshi News home page

పేమెంట్ బ్యాంకుల పోటీని తట్టుకుంటాం

Nov 14 2015 1:14 AM | Updated on Sep 22 2018 8:06 PM

పేమెంట్ బ్యాంకుల పోటీని తట్టుకుంటాం - Sakshi

పేమెంట్ బ్యాంకుల పోటీని తట్టుకుంటాం

వడ్డీరేట్లు తగ్గుతున్నా కార్పొరేట్ రుణాల్లో డిమాండ్ కనిపించడం లేదని, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి మరో ఏడాది పడుతుందని...

విజయా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.ఎస్ రామారావు
* బిజినెస్ కరస్పాండెంట్లకు అధిక ఆదాయ కల్పనపై దృష్టి
* వడ్డీరేట్లు తగ్గినా కార్పొరేట్ రుణాల్లో డిమాండ్ కనబడటం లేదు...
* ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి మరో ఏడాది సమయం పట్టొచ్చు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వడ్డీరేట్లు తగ్గుతున్నా కార్పొరేట్ రుణాల్లో డిమాండ్ కనిపించడం లేదని, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి మరో ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వరంగ విజయా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.ఎస్.రామారావు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో బ్యాంకు మేనేజర్ల సమీక్షా సమావేశానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ మరో ఆరు నెలలు వడ్డీరేట్లు తగ్గే అవకాశాలు లేవంటున్నారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...
 
డిమాండ్ లేదు
ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గించినా కార్పొరేట్ రుణాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంది. అలాగే రిటైల్ రుణాల్లో గృహరుణాలు ఇంకా ఊపందుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఆటో రుణాలకు మాత్రమే గిరాకీ ఉంది. మొత్తం మీద చూస్తే రుణాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంది. ఇదే విధమైన పరిస్థితి మరో ఏడాది పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. ఏడాది తర్వాత ఆర్థిక వృద్ధి వేగం పుంజుకుంటుందని భావిస్తున్నాం.
 
తగ్గే అవకాశాలు తక్కువ
తగ్గుతున్న పారిశ్రామికోత్పత్తి, రుణాలకు డిమాండ్ లేకపోవడం వంటి అంశాలున్నప్పుడు సాధారణంగా వడ్డీరేట్లు తగ్గాలి. కానీ అటువంటి అవకాశాలు కనిపించడం లేదు. దీనికి కారణం పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తోడు అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు వంటి భయాలే. అలాగే డిపాజిట్ల రేట్లు తగ్గించకుండా రుణాల రేట్లను మరింత తగ్గించే అవకాశం లేదు. డిపాజిట్ల రేట్లు తగ్గిస్తే పెన్షనర్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇదే సమయంలో పోస్టాఫీసు చిన్న మొత్తాల పథకాల నుంచి డిపాజిట్ల సేకరణకు బ్యాంకులు పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూస్తే మరో ఆరు నెలల పాటు వడ్డీరేట్లు ఇలాగే స్థిరంగా ఉంటాయని అంచనా వేస్తున్నాం.
 
ఎన్‌పీఏలు తగ్గుతున్నాయ్..
రుణాలకు డిమాండ్ లేకపోయినా.. ఎన్‌పీఏలు తగ్గుముఖం పట్టడం ఒక సానుకూల వాతావరణం. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విజయా బ్యాంక్ అతి తక్కువ ఎన్‌పీఏలను కలిగి ఉన్నది. సెప్టెంబర్ నాటికి మా స్థూల ఎన్‌పీఏలు 3.98 శాతం మాత్రమే. నికర ఎన్‌పీఏలు 2.84 శాతం. రానున్న  కాలంలో ఈ శాతాన్ని మరింత తగ్గించడానికి కృషి చేస్తున్నాం.
 
ఉదయ్‌తో తగ్గనున్న లాభాలు
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థల రుణాల పునర్‌వ్యవస్థీకరణకు ప్రకటించిన ‘ఉదయ్’ పథకం వల్ల రెండు శాతం వడ్డీని నష్టపోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నాం. దీనివల్ల తాత్కాలికంగా లాభాలపై ప్రతికూల ప్రభావం చూపినా, ఈ నిర్ణయం దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నాం. మా బ్యాంకు డిస్క్‌ంలకు ఇచ్చిన రుణాల విలువ  రూ. 7,800 కోట్లు.
 
12 శాతం వృద్ధి..: ఈ ఏడాది వ్యాపారంలో 12 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నాం. గతేడాది రూ. 2.10 లక్షల కోట్లుగా ఉన్న వ్యాపారం వచ్చే మార్చినాటికి రూ. 2.35 లక్షల కోట్లు దాటొచ్చు. వచ్చే నాలుగు  నెలల్లో మరో 150 శాఖలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,755 శాఖలను కలిగి ఉంది.
 
గ్రామీణ మార్కెట్‌పై దృష్టి
పేమెంట్ బ్యాంకులు, చిన్న బ్యాంకుల నుంచి వచ్చే పోటీని తట్టుకోవడమే ఇప్పుడు మా ముందున్న ప్రధాన లక్ష్యం. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల మార్కెట్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. ముఖ్యంగా బిజినెస్ కరస్పాండెంట్ల (బీసీ) వ్యవస్థను మరింత పటిష్టం చేసి వారికి మరింత ఆదాయం ఆర్జించే విధంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నాం. పెన్షన్ పంపిణీ, రుణాల రికవరీ వంటి బాధ్యతలను బీసీలకు అప్పజెప్పాలనుకుంటున్నాం. ప్రస్తుతం ఒకొక్క బీసీ సగటున నెలకు రూ. 5,000 ఆర్జిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో ఈ సంపాదనను రూ. 10,000కు పెంచాలన్నదే మా లక్ష్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement